శాంతియుత సమాజ స్థాపనకు అహింసా మార్గమే అందరికీ ఆచరణీయమని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 154వ గాంధీ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అహింసా మార్గంలో సత్యాగ్రహమే ఆయుధంగా పోరాడి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ అని, గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం అని, సమాజంలో శాంతియుత స్థాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతిఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు.
“సమాజంలో ఏ మార్పునైతే మనము కోరుకొంటున్నామో అటువంటి మార్పు ముందుగా మనతోనే ప్రారంభం కావాలని” మహాత్ముడి భోదనలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలన్నారు. సమాజంలో శాంతిని ఎల్లప్పుడూ కోరుకొనే పోలీసుశాఖ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే పయనించి, ప్రజల్లో మార్పును తీసుకొని రావాలన్నారు. సమాజంలో అందరిని మంచి పౌరులుగా మనము మార్చ లేకపోయినా, కొద్ది మందినైనా హింసా ప్రవృత్తి నుండి దూరం చేసి, వారిని అహింసా మార్గంలో పయనించే విధంగా పోలీసు ఉద్యోగులు తమవంతు కృషి చేయాలన్నారు.
మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి, నిజాయితీతో, దేశం పట్ల గౌరవం, భక్తి కలిగి, శాంతిభద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చెయ్యాలన్నారు. అసాంఘిత కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులైతే, వారికి కౌన్సిలింగు నిర్వహించి, వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా పెద్దలు మార్గ నిర్ధేశం చేయాలన్నారు. హింసాత్మక సంఘటనలు నుండి యువత ప్రేరణ పొందవద్దని, ప్రతీ ఒక్కరూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, పోలీసులకు సహకరించాలని యువతకు, ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పి వెంకట రాముడు , అడిషనల్ ఎస్పీ చంద్రబాబు , రంగముని , స్పెషల్ బ్రాంచ్ సంతోష్ , రిసర్వ్ ఇన్స్పెక్టర్స్ , జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.