గురువారం ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థుల చేత వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేయడంపై లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో తన బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త మనస్థాపానికి గురి చేసిందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను అని లోకేష్ తెలిపారు.