భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ డ్రోన్ల బాంబులతో విరుచుకుపడుతుంటే.. వాటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొడుతోంది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ(Tirumala) భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయి. శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో కలిసి సోదాలు జరిపాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు.