ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ మీద భారత సైన్యం చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఈమేరకు సైనికులకు, దేశ నాయకత్వానికీ దైవ బలం తోడవ్వాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన ఆధ్వర్యంలో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
“ఆపరేషన్ సిందూర్… పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమనీ, శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి – దైవ బలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి… వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిది అన్నారు.
జనసేన పార్టీ పక్షాన మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసన సభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేయిస్తారు. అదే విధంగా కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలిపారు. ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్య శక్తి తోడుండేలా పూజలు చేయిస్తారు. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లోనూ సైన్యం కోసం, యుద్ధ ప్రభావం ఉన్న జమ్ము, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేపడతారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని” సూచించారు.
