Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Govt hospital: CCU వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Kurnool Govt hospital: CCU వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆయుష్మాన్ భారత్లో భాగంగా..

కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించనున్న 50 బెడెడ్ క్రిటికల్ కేర్ బ్లాక్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా దేశంలోని పలు ఎయిమ్స్ వైద్య కళాశాలను జాతికి అంకితం చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శంకుస్థాపనల్లో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 బెడెడ్ క్రిటికల్ కేర్ బ్లాక్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ నుండి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.

- Advertisement -

స్థానిక కర్నూలు వైద్య కళాశాలలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో రూ.23.75 కోట్లతో నిర్మించనున్న 50 బెడెడ్ క్రిటికల్ కేర్ బ్లాక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారన్నారు. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చేవారికి తక్షణ ఆరోగ్య సేవలు అందజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా రోగి వచ్చినప్పటి నుండి వారికి సంబంధించిన వైద్య పరీక్షలు అందజేయడానికి వివిధ రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి పెద్దపీట వేశాయని, ప్రస్తుతం మన ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాయలసీమలోనే మెరుగైన వైద్య చికిత్సలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ గతంలో కరోనా సమయంలో అత్యవసర వార్డులు తక్కువగా ఉన్నందున రోగులు ఇబ్బందిపడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్య సదుపాయం అందజేయడానికి గాను క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు కొరకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారన్నారు. దీని ద్వారా రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందజేయవచ్చన్నారు.

అనంతరం క్రిటికల్ కేర్ బ్లాక్ కు సంబంధించి ఫైలాన్ ను జిల్లా కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైద్యాధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట రంగారెడ్డి, ఏపీఎంఎస్ఐడిసి ఎస్ఈ రమేష్ రెడ్డి, ఈఈ శివకుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News