జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మరోసారి ప్రకాశ్ రాజ్(Prakash Raj) సంచలన ట్వీట్ చేశారు. హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన ఆయన.. తాజాగా మరో కౌంటర్ పోస్ట్ పెట్టారు. గతంలో హిందీ భాషను బలవంతంగా తమపై రుద్ద వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ చేసిన పోస్టులను ఈ ట్వీట్‌కి జత చేశారు. “గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తరువాత ‘భజన సేనాని’… అంతేనా? అని ప్రశ్నించారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలో పవన్ కళ్యాణ్ బహుభాషా విధానంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ తెలిపారు.
కాగా కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీకి మద్దతు తెలిపి సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్నారో అప్పటి నుంచి పవన్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శల దాడి పెరిగింది. పవన్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం మొదలపెట్టారు. దీంతో జనసైనికులు కూడా ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.