Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 13న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది మరింత బలపడే అవకాశం ఉండటంతో, రాష్ట్ర coastline ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లాలో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పెద్దముడియంలో 8.6 సెంటీమీటర్లు, చిత్తూరు మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో 6-7 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది.
తూరపు తీరం వెంబడి పశ్చిమ మరియు వాయవ్య దిశల నుంచి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ కారణంగా, సముద్రంలోకి పడవలతో వెళ్తున్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా చిన్న పడవలు తిరగబడే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిక జారీ చేశారు.
అలాగే, ఉరుములు, మెరుపులు సహితంగా వర్షాలు పడే అవకాశముండటంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. పంట ధాన్యాన్ని బయట ఆరబెట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుండగా, దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా వాయవ్య మరియు పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఇవి కూడా వర్షాల పరంపరను మరింత ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయని తెలిపింది.


