పశ్చిమ విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా కొప్పునూర్ లో 95మి.మీ., ప్రకాశం జిల్లా ఉప్పలపాడులో 91మి.మీ., పల్నాడు జిల్లా ముప్పాళ్లలో 85.5మి.మీ., అధికవర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
బుధవారం కింద విధంగా వాతావరణం ఉండనున్నట్లు వివరించారు
• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
• రేపు పార్వతీపురంమన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాలు, వైయస్సార్ జిల్లాలోని వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపనుంది.
వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం తిరుపతి జిల్లా బలయపల్లిలో 42.9°C, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.4°C, వైయస్సార్ జిల్లా కొండాపురంలో 41.9°C విజయనగరం జిల్లా వంగరలో 41.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.