AP Police| వైసీసీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు(Chandrababu)పై రాళ్ల దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2022 నవంబర్ 5న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో వాహనంపై నిలబడి అభివాదం చేస్తూ వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి ఆయనపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు తలకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వంలో దర్యాప్తు ముందుకు సాగలేదు.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు ఫైల్ ముందుకు సాగింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దాడిలో నిందితులుగా భావిస్తున్న నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. విచారణలో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. విచారణ అనంతరం వీరిని స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు.