Supreme Court Amaravati : అమరావతి పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. కాగా.. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ, హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే స్టే విధించిన సుప్రీంకోర్టు, రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్.. ఏపీ హైకోర్టు ఇచ్చిన రిట్ ఆఫ్ మాండమస్‌పై స్టే ఇవ్వాలని కోరారు. రాజధానిని నిర్ణయించుకునే చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పడం సరి కాదన్నారు. అయితే రైతులతో చేసుకున్న ఒప్పందం గురించి ఏం చెబుతారని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అమరావతిగా రాజధానిని తరలించడం లేదని.. అమరావతిలో లేజిస్లేటివ్ రాజధాని ఉంటుందని.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం ఇప్పటికీ అమరావతినే రాజధానిగా ఉందన్నారు. రాజధాని విషయంలో చట్టం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. ఓ దశలో మరో సీనియర్ న్యాయవాది నారిమన్.. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే జస్టిస్ జోసెఫ్ దీనిపై స్పందిస్తూ రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల అధికారమని, ఒకచోట పెట్టాలి, అభివృద్ధి చేయాలని తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు.
రైతుల తరపున సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. 29 వేల మందిరైతులు తమ బతుకు దెరువు అయిన భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం వల్ల రాష్ట్రానికే కాదని వారికి కూడా లాభం ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారని, 2019 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.
రాజధాని నిర్మాణం పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా..? ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఆదేశిలిస్తారా ? కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు, అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? మీరే ప్రభుత్వమైతే, అక్కడ క్యాబినెట్ ఎందుకు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. హైకోర్టు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తోందా అంటూ న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నప్రశ్నించారు. అంత ఒకే చోట కేంద్రీకరించడం ఎలా.. ఏ నగరాలను అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అంటూ పేర్కొంది. ఏపీ ప్రభుత్వ తరుపున వాదనలు కెకె.వేణుగోపాల్ వినిపించారు. ఒక నెలలో రాజధాని పనులు పూర్తిచేయాలని హైకోర్టు చెపుతోందని, రాజధానిపై నిరంతరంగా హైకోర్టు ఆదేశాలిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అనేది స్థిరమైనది కాదు, అసాధ్యమైన పనులన్నీ చేయమని చెపుతోంది, సమయానుకూలంగా రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి లేదా అని అన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశారు. రేపు శాసన వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పలేము
. రైతుల కాంట్రాక్ట్ ప్రయోజనాలను కాపాడుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది వాధించారు.