52 ఏళ్ళ వయసులో ఓ మహిళా 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్యామల(Goli Shyamala) అనే మహిళా ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ సముద్ర తీరం నుండి కాకినాడ తీరం వరకు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు సృష్టించారు. మహిళ సాహసయాత్రపై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
“52 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోలి శ్యామల గారు విశాఖపట్నం నుండి కాకినాడ తీరం వరకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత కొట్టడం అసాధారణమైన ధైర్యం, దృఢ సంకల్పంతో కూడుకున్నది. ఆరు రోజుల తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ చివరికి ధైర్యంతో విజయం సాధించారు. ఆమె ప్రయాణం నారీ శక్తికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ మాత్రమే కాదు శక్తికి ప్రతిబింబం. ఆమె ప్రశంసనీయమైన విజయం ద్వారా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూ, మన విలువైన సముద్ర జీవులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. శ్యామల గారికి హృదయపూర్వక అభినందనలు” అని ఆయన ట్వీట్ చేశారు.