కౌంటింగు రోజు తాడిపత్రి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసేలా అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోషి జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాడిపత్రి పట్టణంలోకి అనుమానితులు, అల్లరి మూకలు ప్రవేశించకుండా అష్టదిగ్బంధనం కోసం డి.ఐ.జి, ఎస్పీలు ఈరోజు కలియ తిరిగారు. ప్రధానంగా పట్టణంలో ప్రవేశించే అన్ని రహదారుల్లోని పట్టణ శివార్లలో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అనంతపురం రహదారిలోని ఫ్లైఓవర్ వద్ద, పుట్లూరు రోడ్డు టి.టి.డి కళ్యాణ మండపం, యల్లనూరు రోడ్డు శివాలయం, కడపరోడ్డు ఐశ్వర్య విల్లాస్, సజ్జలదిన్నె క్రాస్, చుక్కలూరు క్రాస్, నందలపాడులోని పెద్దపప్పూరు రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను విజిట్ చేసి ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన బందోబస్తును సమీక్షించారు.
కౌంటింగు రోజున పరిసర మండలాలు, గ్రామాల నుండీ అనుమానితులెవరూ చొరబడకుండా నియంత్రించేలా సూచించారు. అంతేకాకుండా… తాడిపత్రి పట్టణంలో ప్రధాన కూడళ్లు, క్రిటికల్ ప్రాంతాలు/కాలనీలలో నిర్వహిస్తున్న పోలీసు పికెట్లను పరీశీలించి కట్కటుదిట్టమైన భద్రతా చర్యల కోసం ముందస్తుగా తగు సూచనలు చేశారు. పట్టణంలో నివసిస్తున్న ముఖ్య నాయకుల ఇళ్లు, పరిసరాలలో సెక్యురిటీ మరియు 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడిపత్రిలో కౌంటింగు రోజు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
డి.ఐ.జి, ఎస్పీలతో పాటు డీఎస్పీలు జనార్ధన్ నాయుడు, బి.శ్రీనివాసులు, జి.శివ భాస్కర్ రెడ్డి, బి.వి.శివారెడ్డి సి.ఐలు వెళ్లారు.