TDP MLC CANDIDATES| త్వరలోనే ఏపీలో నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారుచేశారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థులకు కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ మద్దతు కోరారు. ఇందుకు రెండు పార్టీల నుంచి మద్దతు రావడంతో అధికారికంగా ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
కాగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సుదీర్ఘ కాలంగా టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గత కొన్ని ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మంత్రిగానూ పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. వైసీపీ వేధింపులను ఎదుర్కొని ధీటుగా నిలబడ్డారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు లభించలేదు. కూటమిగా ఎన్నికల బరిలో దిగడంతో తెనాలి సీటును జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆశించారు. దీంతో ఆలపాటి రాజా తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజాకు ప్రభుత్వం ఏర్పడగానే న్యాయం చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునేందుకు గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు.
ఇక మరో సీనియర్ నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్ కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే ఆయనకు కూడా నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. దీంతో ఇరువురి నాయకుల గెలుపును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. మిత్రపక్షాల నాయకులను కలుపుకుని గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కూటమి నేతలు వరుసగా సమావేశమవుతూ ఈ ఎన్నికల్లో విజయం కోసం ఎలా ముందకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.