Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్YSRCP: కొత్త పితలాటకం.. ఈసారి అసెంబ్లీపైనే ఈ ఎంపీల ఆశలు

YSRCP: కొత్త పితలాటకం.. ఈసారి అసెంబ్లీపైనే ఈ ఎంపీల ఆశలు

YSRCP: వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఇప్పటి నుండే పావులు కదుపుతున్న అధికార పార్టీ వైసీపీలో ఈసారి టికెట్లు దక్కేదెవరికి?.. మొండి చేయి ఎవరికి?.. గెలిచేదెవరు?.. గెలుపు అవకాశాలు ఉంది ఎవరికి? ఇలా అధిష్టానం ఎప్పటికప్పుడు రకరకాల మార్గాల ద్వారా నిఘా పెడుతుంది. ఇప్పటికే కొంతమందికి ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని అధిష్టానం ఫిక్సయినట్లు రాజకీయ వర్గాలలో ఊహాగానాలు జోరుగా షికారులు చేస్తుండగా.. వచ్చే ఎన్నికలలో చాలా మంది ఎంపీలు మళ్ళీ పార్లమెంట్ కి వెళ్లే ఉద్దేశ్యంలో లేరని చెప్తున్నారు.

- Advertisement -

ఎందుకంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కొంతలో కొంత ప్రజలతో సంబంధాలుండడం.. సంక్షేమ పథకాల ద్వారానైనా.. తాము ఎంతో కొంత పనిచేసిన ఫీలింగ్ ఉంది. కానీ.. ఎంపీలైతే గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లిన వాళ్ళు చాలా తక్కువ. అందులో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా చాలా వాటిలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎంపీలు కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. అందుకే ఈసారి తాము పార్లెమెంటుకు వెళ్లలేమని.. అసెంబ్లీకి వెళ్తామని అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారట.

ఇలా ఈసారి అసెంబ్లీ సీట్లను ఆశించే వారిలో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంవీవీ సత్యనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కడప ఎంపీ అవినాష్, మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, కాకినాడ ఎంపీ వంగా గీత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా అసెంబ్లీపై ఆశపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో తీవ్రంగా చర్చ నడుస్తుంది.

ఈ ఎంపీలలో కొందరు వివిధ రకాలుగా ఎంపీగా అన్ ఫిట్ అయితే.. మరికొంతమంది రాష్ట్ర మంత్రులు కావాలని ఆశపడుతున్నారు. కడప ఎంపీ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలతో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి ఎంపీగా గెలిచే అవకాశం లేదని అసెంబ్లీకి వెళ్తామంటున్నారు. ఇక నందిగం సురేష్, మార్గని భరత్ ఈసారి రాష్ట్ర మంత్రులు కావాలని ఆశపడుతుంటే.. బాలసౌరి, వంగా గీత యాక్టివ్ లేకపోవడంతో ఎంపీగా గెలుపుపై అనుమానపడుతున్నారు. మొత్తంగా ఈసారి వీళ్లంతా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుండగా వీళ్ళలో టికెట్లు దక్కేదెవరికో.. అసలు రెండిటికీ దూరమయ్యేదెవరో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News