CM Jagan: రెండోసారి కూడా ఏపీలో అధికారపీఠంపై తానే కూర్చోవాలని సీఎం జగన్ గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, బాధ్యులు, జిల్లాల ఇన్ చార్జులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో కూడా జగన్ నేరుగానే ఆదేశాలు జారీచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘175 అవుటాఫ్ 175 వైనాట్?’ అంటూ వారిని ఊదరగొడుతున్నారు. అంటే.. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా చేయాలన్నది ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. ఏక పక్షంగా రాష్ట్రాన్ని ఏలాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నారంటున్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికే లేకుండా చేయాలనేది జగన్ మిషన్ అంటున్నారు.
ఎవరు ఏమన్నా.. సీఎం జగన్ పరిపాలనలో అనుభవ రాహిత్యంతో అప్పులపై ఆధారపడి పరిపాలిస్తున్నారని, అభివృద్ధి కన్నా సంక్షేమమే ముఖ్యమనే వైఖరి, అన్నిటికి మించి విధ్వంసంతో పాలన మొదలు పెట్టి ఈ మూడున్నరేళ్లుగా అదే పంథాలో కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు మంత్రులతో పాటు మరికొందరు వైసీపీ నేతల తీరుపట్ల రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తికాలం కొనసాగాక ఎన్నికలకు వెళ్లే.. వ్యతిరేకత మరింత పెరిగిపోయి కొంప కొల్లేరవుతుందని అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయంటున్నారు.
ఏపీలో ఇప్పటికే జనసేన- బీజేపీ పొత్తులో ఉన్నాయి. మరో పక్కన వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ ప్రజా వ్యతిరేక తీరుతెన్నులపై తెలుగుదేశం అధినేత, నాయకులు నిత్యం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైజాగ్ సంఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచే కొద్దీ జనసేన-బీజేపీ కూటమికి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే పోలింగ్ నిర్వహిస్తే.. అది జగన్ కోరికకు, ఆశకు గండి పడే ప్రమాదం ఉందంటున్నారు. అడగకుండా ప్రతిసారీ అన్ని అంశాలలో మద్దతు ఇస్తున్న వైసీపీ పట్ల బీజేపీ అగ్రనేతలు మోడీ-షా జోడీకి జగన్ అలుసై పోయారనీ, అందుకే విశాఖలో ఇటీవలి మోడీ పర్యటన, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతగా పాటుబడినా పెద్దగా గుర్తించలేదంటారు. పైగా వైసీపీపై యుద్ధం ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని అరగంటకు పైగా మోడీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ పెద్దల కన్నా జనసేనానికే మోడీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టం అయిందంటున్నారు.
2024 మేనెలలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. అప్పటికి యాంటీ ఇంకంబెన్సీ పీక్స్ చేరుకుంటుందని, తనకు ఇబ్బంది తప్పదని జగన్ భావిస్తున్నారంటున్నారు. సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. కేంద్ర ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమే అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందనీ, మోడీ సానుకూలత ఉంటే అది పవన్ కు, మోడీ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే అది చంద్రబాబుకూ అనుకూలంగా మారి వైసీపీ కొంప ముంచడం ఖాయమని జగన్ భావిస్తున్నారని పార్టీ శ్రేణులే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
అందుకే.. 2023 డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో ముందస్తుకు వెళ్తే.. అప్పుడు కేంద్రంపై ప్రజాభిప్రాయం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉండదనీ, అన్నిటికీ మించి తెలంగాణలో అధికారం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ప్రచారం విషయంపై పెద్దగా దృష్టి సారించదనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించి, అధికారం మళ్లీ చేజిక్కించుకుంటే.. పార్లమెంట్ ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందనేది వైసీపీ అధినేత అభిప్రాయం అంటున్నారు. అప్పుడు మరిన్ని ఎక్కువ లోక్ సభా స్థానాలు తాము గెలుచుకోవచ్చనేది జగన్ వ్యూహం అని చెబుతున్నారు. ఇలాంటి కారణాలతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.