తిరుపతిలో(Tirupati) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు పోటెత్తడం.. తొక్కిసలాట జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు(Garikapati Narasimha Rao) సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశికి ఆలయాలకు పోటెత్తడం సరికాదని రెండు మూడు రోజులు ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం జరగదని గరికపాటి చెప్పారు. ముక్కోటి ఏకాదశికి భక్తులంతా తిరుపతిలోనే ఉంటారని.. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తుతారని గుర్తుచేశారు. అదే రోజు దర్శనం చేసుకోవాలని ఎగబడటంతోనే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. భగవంతుడి దర్శనానికి ముహుర్తాలు, పుణ్య తిథులు లేవని, ఫలానా రోజే, ఫలానా ముహుర్తానికే వెళ్లాలని ఏమీ లేదని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తిథులు ఇవేవీ ముఖ్యం కావని శరీరాన్ని మించిన క్షేత్రం, మనస్సును మించిన తీర్థం లేవన్నారు.