2024 ఏడాదికి సంబంధించి తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ(Srivari Hundi) ఆదాయం, ఇతర వివరాలను టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. గత ఏడాది శ్రీవారికి హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారని చెప్పారు. అలాగే 99 లక్షల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొన్నారు. ఇక 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారని.. 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు వివరించారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామివారిని 69,630 మంది భక్తులు దర్శించుకోగా.. 18,965 మంది భక్తలు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.