Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్TTD EO Dharmareddy : జైలు శిక్షపై అప్పీలు చేసుకున్న టీటీడీ ఈఓ..

TTD EO Dharmareddy : జైలు శిక్షపై అప్పీలు చేసుకున్న టీటీడీ ఈఓ..

టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెలరోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. ఉద్యోగుల క్రమబద్దీకరణపై కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో నిన్న ఏపీ హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ధర్మారెడ్డి ఈ నెల 27 లోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

2011లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటికే 17 ఏళ్లుగా ప్రోగ్రాం అసిస్టెంట్లుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు సేవ్లా నాయక్, ఆర్ స్వామి నాయక్, కొమ్ము బాబు ఈ నోటిఫికేషన్ ను కోర్టులో సవాల్ చేశారు. తమను క్రమబద్దీకరించాలని టీటీడీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. టీటీడీ నోటిఫికేషన్ ను కొట్టి వేసింది. పిటిషనర్లను రెగ్యులరైజ్ చేయాలని టీటీడీని ఆదేశించింది. టీటీడీ కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదంటూ మళ్లీ.. ఆ ముగ్గురు కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఈ ఏడాది జూన్ లో వేశారు. ఆ పిటిషన్ పై టీటీడీ కౌంటర్ దాఖలు చేసింది కానీ.. ఇది ముమ్మాటికీ ధిక్కరణేనని హైకోర్టు ఆగ్రహించింది.

తమ ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి ఏమిటో కౌంటర్ లో అర్థమవుతోందని అన్నారు. తమ ఆదేశాలను గరిష్ఠంగా రెండు నెలల్లోగా అమలు చేయాలని చెప్పారు. తాజాగా మరోసారి పిటిషన్ విచారణకు రాగా.. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను పక్కన పెట్టేశారని.. కోర్టు ధిక్కరణ కింద ఈవో ధర్మారెడ్డి శిక్షకు అర్హులే అని అన్నారు. అనంతరం ధర్మారెడ్డికి జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. వెంటనే టీటీడీ తరపు న్యాయవాది సింగిల్ జడ్జి తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు. జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై ఈ రోజు విచారణ జరపనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News