విశాఖపట్నం భూ వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.. మూడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అజ్ఞాత సంస్థకు అప్పగించిన వ్యవహారంపై తాజాగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూ లావాదేవీల వెనుక తన సొంత తమ్ముడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పాత్ర ఉందని నేరుగా ఆరోపించారు.
కాపులుప్పాడులోని కీలక ప్రాంతాన్ని ఉర్సా అనే కంపెనీకి అప్పగించడమే కాకుండా, దీని ప్రమోటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియా ముందుకొచ్చిన తీరు.. అంతా ఒక పథకం ప్రకారమే నడిచినట్టు ఉందని ఆయన ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తులు, ఈ కంపెనీ స్థాపకులుగా వ్యవహరిస్తున్నప్పటికీ, వారి గతం, సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ నాని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలోని ఓ ప్రమోటర్ అబ్బూరి సతీష్ తన తమ్ముడితో కలిసి చదువుకున్నారని పేర్కొంటూ, ఈ వ్యవహారమంతా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్టుగా కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు.
గతంలో 21 సెంచరీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించి ప్రజలను మోసం చేసిన ఘటనను నాని గుర్తు చేశారు. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేశినేని నాని ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో నానిపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. “సైకో”, “విరోధం కోసం మాట్లాడుతున్నాడు” అంటూ పరోక్షంగా దూషణలకు దిగారు. అయినా నాని వెనక్కి తగ్గలేదు. “నిజం చెప్పడమే నా పని. ఎవరు ఏమన్నా, ఎన్ని బూతులు తిట్టినా నా ధైర్యం తగ్గదు” అంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“వైజాగ్ ఈజ్ ఫర్ సేల్” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖపట్నం మహానగరాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా ప్రభుత్వంపై గట్టి విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, అది తేలాల్సి ఉంది.