వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshminarayana) సీబీఐ మాజీ జేడీగా పాపులర్ అయ్యారు. అనంతరం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. అయితే పవన్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు.
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. కాలినడకన బురదలోనే మన్యం ప్రాంతం చేరుకుని వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం కురిపించారు.
“రాజ్యాంగంలో పొందుపరిచిన 46, 244, 244ఏ, 275(1) అధికరణల్లోని నిబంధనలు గిరిజనులకు విద్య, భూ హక్కులు, సంక్షేమం కల్పించాలని సూచిస్తున్నాయి. గిరిజన సంక్షేమం కోసం నిధులకు గిరిజన ఉప ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం, గిరిజన వ్యవహారాల పథకాలు, జిల్లా ఖనిజ లవణాల ఫౌండేషన్ కీలక వనరులుగా ఉన్నాయి. గిరిజనులకు కేటాయించిన నిధులు అట్టడుగుస్థాయి వరకు చేరేలా, గిరిజన పథకాలు సమర్థవంతంగా అమలు చేసేలా మీ నాయకత్వంలో కృషి జరుగుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. కాగా పవన్‌పై లక్ష్మీనారాయణ పొగడ్తలు చూస్తుంటే మళ్ళీ ఆయన జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ మొదలైంది.