MLC elections: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మాట్లాడుతూ.. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనపడటం లేదని తెలిపారు. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు వైసీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందుకే ఎన్నికల బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని పోలీసు వ్యవస్థ అచేతనంగా తయారైందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్(Pawankalyan) చెప్పే పరిస్థితి నెలకొందన్నారు.
కాగా కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను కూటమి పార్టీలు ఖరారుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడంతో కూటమి అభ్యర్థుల గెలుపు సునాయాసంగా మారింది. వీరిద్దరి గెలుపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.