ఏపీ అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు పాటు నిర్వహించాలనే దానిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు మాజీ CM, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ సమావేశాలకు వైసీపీ ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనాలని వైసీపీ అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీకి జగన్ వస్తారా.. లేదా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. రాజకీయ పరిస్థితులు, అప్పటి పరిస్థితి బట్టి జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ అసెంబ్లీకి రాలేదు. ఈసారి కూడా ఆయన దూరంగా ఉంటారా.. లేక సమావేశాలకు హాజరవుతారా.. అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు అసెంబ్లీకి హాజరుకాకపోతే జగన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఆయన హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.
జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని అధికార పక్షం తప్పుబడుతుండగా, ఆయన హాజరైతే సభలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ జగన్ గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, తర్వాత సమావేశాలకు రాకుంటే, ఆ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొనబోతున్నారా.. లేదా.. అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది.