కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi)పై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చెంపల మాదిరిగా రోడ్లను నిర్మిస్తానంటూ బిధూరి చేసిన వ్యాఖ్యలను తీవ్ర వేదనతో ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఆలోచనలు, చర్యలు వారి నాయకులకు మహిళల పట్ల పూర్తి అగౌరవాన్ని చాటుతుందని విమర్శించారు. బిధూరి వ్యాఖ్యలు శిక్షార్హతతో కూడుకున్నాయని మండిపడ్డారు.
తమ వైఫల్యాలు, దురాగతాల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకు, సోనియా, రాహుల్ గాంధీపైనా వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతుందని.. ఇప్పుడు ప్రియాంకకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్‌లను కూడా బీజేపీ నేతలు కూడా వదిలిపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. నైతిక విలువలు లేకుండా విమర్శలు చేస్తున్న మతోన్మాద బీజేపీ నేతల దుర్మార్గ వైఖరిని దేశం మొత్తం గమనిస్తోందన్నారు. త్వరలోనే ఈ మతోన్మాదులకు తగిన గుణపాఠం చెబుతుందని షర్మిల హెచ్చరించారు.