తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగయ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకం రేపింది. మరోవైపు ఈ కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతుండటంతో ప్రభుత్వం ఈ కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే నేటితో వివేకా హత్యకు గురై ఆరు సంవత్సరాలు పూర్తి అయింది. వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha Reddy) పులివెందులలో నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాని వాపోయారు. ఇంత అన్యాయం జరిగినా ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదన్నారు. అయినా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సీబీఐ మళ్లీ విచారణ మొదలు పెడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందన్నారు. అయితే సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇక సాక్షుల మరణాలు వెనక కుట్రలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.