ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కుటుంబపరంగా.. రాజకీయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగలడం సంచలనం రేపుతోంది. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ బీజేపీలో చేరడం ఒకటైతే.. కొన్ని గంటల వ్యవధిలో కడప మేయర్‌ను ఏపీ ప్రభుత్వం తొలగించింది. కంచుకోటలాంటి సొంత కడప జిల్లాలో ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్‌సీపీ నాయకుడు కడప మేయర్ సురేశ్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబసభ్యులకు కాంట్రాక్టులను అప్పగించి ఆయన మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో అతడిని పదవి నుంచి తొలగించింది. మార్చి 28వ తేదీన పంపిన షోకాజ్ నోటీస్‌కు ఆయన ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేసింది. సురేశ్ బాబు రూ.36 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అవినీతి విషయంలో విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేశ్ బాబును తొలగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వలు జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ ఎంఎస్ వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌తో చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మేయర్ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆయన కుటుంబసభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా? చేయరాదనే విషయం మేయర్ దృష్టికి తీసుకెళ్లారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలు విజిలెన్స్ అధికారులు రాబట్టారు. కాంట్రాక్ట్ కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేశ్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించడంతో పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్‌కు తెలుపుతూ కమిషనర్ లేఖ రాశారు. ఈ అంశంపై మంగళవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై మేయర్ సురేశ్ బాబు వివరణ ఇచ్చారు. అయితే కమిషనర్ ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. కమిషనర్ సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ బాబుపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.36 లక్షలు అవినీతికి పాల్పడినట్టు సురేశ్ బాబును దాదాపుగా నిర్ధారించారు.


