Saturday, November 15, 2025
Homeబిజినెస్Bitcoins Billionaire Boom: మాయల మరాఠీ బిట్‌కాయిన్.. రూపాయిని కోటి చేసిన అద్భుతం!

Bitcoins Billionaire Boom: మాయల మరాఠీ బిట్‌కాయిన్.. రూపాయిని కోటి చేసిన అద్భుతం!

Bitcoin Investment Returns: ఒక్క రూపాయి… అక్షరాలా కోటి రూపాయలుగా మారుతుందని ఊహించగలమా..? ఇది సినిమా కథ కాదు, మాయాజాలం అంతకన్నా కాదు. ఇది క్రిప్టో కరెన్సీ ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు ‘బిట్‌కాయిన్’ సృష్టించిన నిజ జీవిత అద్భుతం. ఒకప్పుడు చిల్లర పైసలకు దొరికిన ఈ కనిపించని నాణెం, నేడు లక్షలు దాటి కోటి రూపాయల వైపు పరుగులు పెడుతోంది. అసలు ఈ బిట్‌కాయిన్ అంటే ఏమిటి..? దాని ధర ఎందుకిలా ఆకాశమే హద్దుగా పెరుగుతోంది..? ఒకప్పుడు దీని విలువ ఎంత..? ఇప్పుడు ఎంత..? 

- Advertisement -

రూపాయి నుంచి కోటి వరకు.. ప్రస్థానం: 

విషయం నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. 2010 సమయంలో బిట్‌కాయిన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పుడు దాని విలువ ఒక్క రూపాయి కన్నా తక్కువే. ఆ సమయంలో ఓ పది రూపాయలు పెట్టి పది, పదిహేను బిట్‌కాయిన్లు కొని పక్కన పడేసి ఉంటే, నేడు మీరు పది కోట్లకు పైగా ఆస్తికి యజమానులు అయ్యేవారు. అవును, చేతితో తాకలేని, పర్సులో పెట్టుకోలేని ఈ డిజిటల్ కరెన్సీ తన రికార్డులను తానే బద్దలు కొడుతూ, లక్ష డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 83 లక్షలకు పైగా) మార్కును దాటి దూసుకెళ్తోంది. అందుకే, ఒకప్పుడు రూపాయి కూడా విలువ చేయని బిట్‌కాయిన్ నేడు కోటి రూపాయల మాటను నిజం చేసి చూపిస్తోంది.

ధరను ప్రభావితం చేసే అంశాలు:

బిట్‌కాయిన్ ధర పెరగడం వెనుక కొన్ని కీలకమైన ఆర్థిక సూత్రాలు పనిచేస్తున్నాయి.డిమాండ్ & సప్లయ్: మార్కెట్‌లో ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగి, సప్లయ్ (సరఫరా) తక్కువగా ఉంటే దాని ధర పెరుగుతుంది. బిట్‌కాయిన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

పరిమితమైన సరఫరా:

ప్రపంచంలో కేవలం 21 మిలియన్ల (2 కోట్ల 10 లక్షలు) బిట్‌కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. బంగారంలాగే ఇది కూడా పరిమితంగా ఉండటంతో, దీనిని ‘డిజిటల్ బంగారం’ అని కూడా పిలుస్తున్నారు. ఈ కొరతే దీని విలువను పెంచుతోంది.

మైనింగ్ అనే చిక్కుముడి:

బిట్‌కాయిన్లను మన కరెన్సీ నోట్లలా ముద్రించలేరు. అత్యంత క్లిష్టమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లెక్కలను (పజిల్స్) పరిష్కరించడం ద్వారా ‘మైనింగ్’ అనే ప్రక్రియలో వీటిని సృష్టిస్తారు. ఇది చాలా ఖర్చుతో, సమయంతో కూడుకున్న పని.

నాలుగేళ్లకోసారి ‘హాల్వింగ్’:

బిట్‌కాయిన్ ప్రోగ్రామింగ్ ప్రకారం, ప్రతి నాలుగేళ్లకోసారి కొత్తగా సృష్టించే బిట్‌కాయిన్ల సంఖ్య సగానికి పడిపోతుంది. దీనిని ‘హాల్వింగ్’ అంటారు. దీనివల్ల మార్కెట్‌లోకి వచ్చే కొత్త నాణేల సరఫరా తగ్గి, ధర అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది.

ఇన్వెస్టర్ల కన్ను బిట్‌కాయిన్‌పైనే:

బంగారం, స్టాక్ మార్కెట్ కంటే కొన్ని సందర్భాల్లో బిట్‌కాయిన్ అత్యధిక రాబడిని ఇస్తుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, ముఖ్యంగా భారతీయ మదుపరులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌లో బుల్ ర్యాలీ కొనసాగుతుండటంతో, కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అయితే, ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా పడిపోయే ప్రమాదం కూడా క్రిప్టో కరెన్సీలలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad