SEBI Warning To Investors: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా), అక్రమ, నియంత్రణ లేని మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మదుపరులను హెచ్చరించింది. ఇటీవల ఒక హిందీ దినపత్రికలో డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఇచ్చిన పూర్తి పేజీ వాణిజ్య ప్రకటన నేపథ్యంలో సెబీ ఈ స్పందనను తెలియజేసింది.
డబ్బా ట్రేడింగ్ ప్రకటనపై ఫిర్యాదు:
ఈ నెల 13న ప్రచురితమైన ఆ ప్రకటనలో, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆపై పెద్ద మొత్తంలో ఆకర్షణీయమైన లాభాలను పొందవచ్చని పేర్కొనబడింది. అయితే, సదరు సంస్థపై, దానితో సంబంధం ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే సెబీ స్పందిస్తూ, అక్రమ ట్రేడింగ్ సేవలను అందించే ఏ సంస్థతోనూ లావాదేవీలు జరిపి మదుపరులు నష్టపోవద్దని స్పష్టం చేసింది. గత వారంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కూడా మదుపరులను ఇదే తరహాలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్‌పై పరిశీలన:
డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఇచ్చిన ప్రకటన అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రమాణాలకు విరుద్ధంగా ఉందా? అన్న కోణంలో పరిశీలించాలని సెబీ ASCIకి సూచించింది. ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు నియంత్రణ వ్యవస్థ పరిధికి వెలుపల ఈ డబ్బా ట్రేడింగ్ జరుగుతుందని సెబీ వెల్లడించింది.


