ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయ స్పందించారు. తన తల్లిది ఆత్మహత్యాయత్నం కాదని చెప్పారు. అమ్మ ఇటీవల ఇన్‌సోమ్నియాతో ఇబ్బందిపడ్డారని.. వైద్యుల సూచన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని పేర్కొన్నారు. అంతేకానీ, ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని.. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందన్నారు. తన పేరెంట్స్ మధ్య విభేదాలు లేవని ఆనందంగా ఉన్నారన్నారు. త్వరలోనే అమ్మ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని దయ వెల్లడించారు.
కాగా మంగళవారం రాత్రి కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడిన కల్పన.. నిద్ర మాత్రలు ఎక్కువగా మింగారు. దీంతో అపస్మారక స్థితికి వెళ్లిన ఆమె తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన వెంటనే అపార్ట్‌మెంట్ వాసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో డోర్ బద్దలుకొట్టి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు.