సంధ్యా థీయేటర్ ఘటనలో థియేటర్ మొత్తం ఏడు మంది యజమానుల్లో ఒకరైన ఓనర్ సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆదివారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఏసిపి రమేష్‌కుమార్ ఘటనకు కారకులైన ముగ్గురి అరెస్ట్‌ను మీడియాకు చూపారు. వారి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి రమేష్ మాట్లాడుతూ… ఈ నెల 4వ తేదీ రాత్రి ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని సంధ్యా థీయేటర్ 70 ఎంఎంలో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోను వీక్షించేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక దిల్‌షుఖ్‌నగర్‌కు చెందిన రేవతి మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ ( 9 ) ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
అల్లు అర్జున్‌కు చెందిన బౌన్సర్లు అందరికి తోసుకుంటూ వెళ్లడంతో థీయేటర్‌లోని సీట్ల కింద అభిమానులు ఇరికిపోయారని, సాయికుమార్ అనే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో మా సిఐ రాజు నాయక్, ఎస్ఐలు ప్రసాద్‌రెడ్డి, మౌనిక, కానిస్టేబుల్ ఆంజనేయులు అపస్మారకస్థితిలో ఉన్న రేవతిని, ఆమె కొడుకు శ్రీతేజను దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారన్నారు. రేవతి అప్పటికి మృతి చెందిందని వైద్యులు తెలిపారన్నారు. ఆ బాలుడికి అందచేయడం జరిగిందన్నారు. ఆ బాలుడి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసులు 105, 118 ( 1 ) ఆర్/డబ్ల్యు3 ( 5 ) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
విచారణలో భాగంగా హీరో అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని ముందుగా పోలీసులకు ఇవ్వకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని గుర్తించామన్నారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని, లీగల్ టీంతో సంప్రదించి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా త్వరలో నోటీసులు ఇస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. ఈ కేసులో అక్కడున్న సిసి కెమెరాలను పరిశీలించి, సాక్ష్యాల ఆధారంగా న్యాయనిపుణుల సలహాలు, ఉన్నతాధికారుల సూచనలను తీసుకొని కేసును దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.