భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆశ్వయుజ పూర్ణిమను పురస్కరించుకొని గురువారం శ్రీరామ భక్త శబరి స్మృతి యాత్రను ఘనంగా నిర్వహించారు. శబరి చిత్ర పటంతో భక్తుల జయ జయ ద్వానాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
శబరి పేరుతో గురువారం నాడు జరిగిన నిత్య కళ్యాణంలో శ్రీ స్వామి వారికి ఫల, పుష్పాలతో ప్రత్యేకంగా ఆర్చించారు. ఈసారి శబరి స్మృతి యాత్ర భద్రాచలంతో పాటు అశ్వారావుపేట వద్ద గల వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ దేవాలయం వద్ద భద్రాద్రి రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకపురం నుండి శ్రీరామ రథంతో ముత్యాలమ్మ గుడి వరకూ వేలాది మంది గిరిజనులు శోభాయాత్రగా తరలి వెళ్లారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు కళ్యాణం అనంతరం అన్నప్రసాదం, స్వామి వారికి కళ్యాణంలో నివేదించిన ఫల, పుష్ప ప్రసాదంతో పాటు భద్రాద్రి రామయ్య లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం రామాలయం కార్యనిర్వాహణాధికారి రమాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు.