ధర్మదేవతగా, వేదమాతగా ప్రత్యక్ష దైవంగా కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరజిల్లుతూ మున్నేటి ఒడ్డున భక్తులచే పూజలు అందుకుంటున్న గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు శీలంశెట్టి రామభద్రయ్య ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు కన్నుల పండుగగా జరగనుంది.
తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గార్ల మండల కేంద్రంలోని స్థానిక పాకాల ఏటి ఒడ్డున శ్రీలక్ష్మి తిరుపతమ్మ దేవాలయాన్ని శోభాయ మానంగా ముస్తాబు చేశారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నాడు దేవాలయం ఆవరణంలో వేద పండితులు మంత్రోత్సణలు అశేష భక్త జనవాహిని మధ్య మేళ తాళాలతో వాయిద్యాల నడుమ పుణ్య దంపతులు పీటలపై కూర్చోగా తిరుపతమ్మ గోపయ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శీలంశెట్టి రామభద్రయ్య తెలిపారు.
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వాముల కళ్యాణం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామి అమ్మ వార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు.