తెలుగువారి అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలా పట్టణాలు ఖాళీ అవుతాయి.. పల్లెలు నిండిపోతాయి. ఈ పండుగను తెలుగు ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి నాడు చేసే దాన, ధర్మాలకు విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెపుతున్నారు. సంక్రాంతి నాడు సూర్యుడు తన దిశను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు మార్చుకుంటాడు. ఉత్తరాయణం మొదలయ్యే ఈ సమయం దేవతలకు రాత్రి పూర్తై సూర్యోదయం అయ్యే సమయం. దేవతలు నిద్రలేచే ఈ సమయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇంత విశేషమైన రోజు చేసే స్నానం, దానం మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతుంటారు.
పుణ్యకాలం ఎప్పుడు: 2025లో మకర సంక్రాంతిని జనవరి 14 (మంగళవారం) వచ్చింది. ఈ రోజున పాడ్యమి తిథి – మంగళవారం రాత్రి 3.28 నిముషాలవరకూ ఉంటుంది. అంటే తెల్లవారితే బుధవారం
శ్రీరామచంద్రుడి నక్షత్రం అయిన పునర్వసు ఉదయం 10.52 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8.28 నుంచి 10.03 వరకు ఉన్నాయి. తిరిగి రాత్రి తెల్లవారుజామున 4.43 నుంచి 6.20వరకు ఉంది.ఇక దుర్ముహూర్తం ఉదయం 8.51 నుంచి 9.35 వరకు.. తిరిగి రాత్రి 10.49 నుంచి 11.41 వరకు ఉంది. సూర్యోదయం ఉదయం 6.38, సూర్యాస్తమయం సాయంత్రం 5.40.
పుణ్య స్నానం ఎప్పుడు చేయాలి: సంక్రాంతి పర్వదినం నాడు.. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. సూర్యభవవానుడికి అర్ఘ్యం విడిచి పెట్టాలని పెద్దలు, పండితులు చెపుతుంటారు. ఇక ఎలాంటి వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో పెద్దలకు తర్పణాలు ఇవ్వాలని చెపుతుంటారు. సంక్రాంతి నాడు చనిపోయిన పూర్వీకులు పెద్దలను పూజిస్తారు. ఈ సంవత్సరం పెద్దలను పూజించాల్సిన పుణ్యకాలం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని పండితులు చెపుతున్నారు.
ఇక మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు తన దిశను మార్చునే సమయంలో శని దేవుడి గృహంలో సంచరిస్తాడని చెబుతారు. సూర్యుడి తనయుడు శని. మకర సంక్రాంతి రోజు శనిని పూజించడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజునాడు.. ఉదయం నదీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు శనీశ్వరుడిని కూడా స్మరించాలని చెపుతున్నారు. ముఖ్యంగా నువ్వులు దానం చేసి… పిండి వంటలు పంచి పెడితే మంచి ఫలితాలు ఉంటాయంట.