ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పండగ నెల మొదలు డిసెంబర్ 16వ తారీకు నుంచి ప్రతిరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గొబ్బెమ్మ ఉత్సవం నిర్వహిస్తారు. పండగ నెలలో ప్రతి ఉదయం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి అనంతరం గొబ్బెమ్మను శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనము ఏర్పాటు చేశారు.
సంక్రాంతి సంప్రదాయంగా రోజూ
సంక్రాంతి పండగ సందర్భంగా సూర్యోదయం ముందే ప్రతి ఇంటి వాకిళ్లలో యువతులు కళ్ళాపు చల్లి పేడతో చేసిన గొబ్బెమ్మ ప్రతిమను పసుపు కుంకుమతో బొట్లు పెట్టి, పెరటిలో కాసిన సొర పూలు, గుమ్మడి పూలు, తంగేడు పూలు గొబ్బెమ్మ చుట్టూ అలంకరించి రంగురంగుల ముగ్గులు వేసి ఇంటి ముందు గొబ్బెమ్మను పూజిస్తుండడం సాంప్రదాయం.
శుక్రవారం ఉత్సవం
ఇది ధనుర్మాస పండగ నెల సాంప్రదాయక ఆచారం. శ్రీకాళహస్తి పురవీధుల్లో ప్రతి రోజు గొబ్బెమ్మను ఊరేగిస్తూ భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేస్తారు ఆలయాధికారులు. ఈరోజు శుక్రవారం కావడంతో గొబ్బెమ్మను అలంకరించి ప్రజలకు భక్తులకు దర్శన భాగ్యం కలిగించి భక్తులు గొబ్బెమ్మ దర్శించుకుని ఆనంద పరవశులైనారు.