శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి వారికి ప్రీతి పాత్రమైన సోమవారం పురస్కరించుకొని ఆలయంలో మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధలు పడుతున్న వారెవరైనా ఆరోగ్యం కుదుటపడాలని మృత్యుంజయ స్వామి అభిషేకంలో పాల్గొని స్వామిని పూజిస్తారు.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మృత్యుంజయ స్వామి ఆశీస్సుల కోసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేకంలో భక్తులు పాల్గొంటారు. మృత్యుంజయ స్వామి శివలింగాకృతిలో దర్శనమిస్తూ అభిషేక సమయంలో స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, నెయ్య, తేనె, విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకమాచరిస్తారు. ఈ సమయంలో భక్తులు పాల్గొని స్వామి వారి అభిషేకాన్ని దర్శిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారి నామ, గోత్రాలపై స్వామి వారికి అర్చన చేయిస్తూ భక్తులు మొక్కులు చెల్లిస్తారు.