విశ్వశాంతి కోసం పలు సత్సంకల్పాలతో జన జాగృతి యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు స్వామి శ్రీశైల జగద్గురు మహా స్వామీజి. గతేడాది అక్టోబర్ 29న కర్నాటకలోని బెళగాం జిల్లా యడ్యూర్ శ్రీ క్షేత్రం లో ప్రారంభించి..శ్రీశైలం వరకు స్వామి యాత్ర సాగింది. సుమారు 650 km పాదయాత్ర చేసి నవంబర్ 30వ తేదీన శ్రీశైలం చేరుకున్నారు. ఆ తరవాత 41 రోజుల ఆధ్యాత్మికానుష్టానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు శ్రీశైల జగద్గురు పీఠం వారి సన్నిధిలో రుద్ర హోమము, బిల్వార్చన, అన్నదాన సేవ, ఇష్ట లింగార్చన పూజ లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు.
ఈనెల 10 తేదీ నుంచి 15వ తేదీ వరకు ‘జన జాగృతి సమ్మేళనం’ పేరుతో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారీ ఎత్తున శ్రీశైలంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాశీ జగద్గురువు స్వామి, ఉజ్జయిని జగద్గురు స్వామితో పాటు వందలాది శివాచార్య మహాస్వామిజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి తరలి వచ్చారు.