Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Indian women missing: మహిళల గల్లంతు సమస్యలపై నిర్లక్ష్యం

Indian women missing: మహిళల గల్లంతు సమస్యలపై నిర్లక్ష్యం

దేశంలో గల్లంతవుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగుతుండడం ఆందోళనకర విషయం. ప్రతి ఏటా కనీసం 12 శాతం పెరుగుదల ఉంటోందని జాతీయ నేర రికార్డుల సంస్థ గతంలో పేర్కొంది. ఢిల్లీ, ముంబై, కోల్‌ కతా, చెన్నై వంటి మహా నగరాల్లోనే కాకుండా, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో కూడా మహిళల గల్లంతుకు సంబంధించిన కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నట్టు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇందలో కోల్‌ కతా 1,236 కేసులతో అగ్రస్థానంలో ఉండగా ముంబై నగరం 1,112 కేసులతో ద్వితీయ స్థానంలో ఉంది. బెంగళూరులో గత ఏడాది 485 మంది మహిళలు గల్లంతయినట్టు శాసనసభలోనే కర్ణాటక హోం మంత్రి ప్రకటించడాన్ని బట్టి ఈ సమస్య ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గల్లంతయిన మహిళల్లో ఎక్కువ మంది 22 ఏళ్ల లోపువారే. ఇందులో కొందరిని ఏదో విధంగా పట్టుకుని బాల నేరస్థుల పునరావాస కేంద్రాలకు పంపించడం జరుగుతోంది కానీ, ఎక్కువ భాగం కేసులు అంతు చిక్కకుండానే ఉన్నాయి.
ఆందోళనకర విషయమేమిటంటే, దేశవ్యాప్తంగా గత పది పన్నెండేళ్ల కాలంలో అకస్మాత్తుగా మాయమయిపోయిన మహిళల సంఖ్య సుమారు 16,000 వరకూ ఉండగా, అందులో 70 శాతం మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారే కావడం గమనించాల్సిన విషయం. ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరిగి రాని పిల్లల కోసం వెతకలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక, చేసినా ఉపయోగం లేక మిన్నకుంటున్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంటోందని ఇటీవల జాతీయ మహిళా హక్కుల పరిరక్షణ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఆర్థికంగా కష్టనష్టాలు వగైరా కారణాల వల్లే కాకుండా, అపహరణలు, అక్రమ రవాణాలు, హత్యల కారణాల వల్ల కూడా మహిళలు ఇంటి నుంచి వెళ్లిపోవడం, కనిపించకుండా పోవడం ఎక్కువవుతోందని ఆ అధ్యయనంలో తేలింది. అయితే, గల్లంతయిన మహిళ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వాదిస్తున్నప్పటికీ, అది కుంటి సాకు కిందే కనిపిస్తోంది. ఆ సమాచారాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పోలీసులదేనని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. మహిళల గల్లంతు విషయంలో తమకు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందినప్పుడు, దాన్ని నిర్వి రామంగా అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ, సమాచారం అందుకుంటూ ఉండాల్సిన బాధ్యత పోలీసులదేనని మహిళా హక్కుల పరిరక్షణ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
మహిళలు మాయమవడానికి సంబంధించిన కేసుల్లో పోలీసుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటోందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. గల్లంతయిన మహిళల కేసుల విషయంలో అనేక పర్యాయాలు న్యాయస్థానాలు పోలీస్‌ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాలను మందలించినప్పటికీ, ఈ కేసుల సంఖ్య ఆయేటికాయేడు పెరుగుతూ పోతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సైబర్‌ సంబంధిత దర్యాప్తు సాధనాలతో ఈ కేసులను దర్యాప్తు చేయాలని, వీటి విషయంలో నిర్లక్ష్యం కూడదని ఢిల్లీ హైకోర్టు 2013లోనే పోలీస్‌ అధికారులకు మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం జరిగింది. నిజానికి, ఇటువంటి కేసుల్లో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు ఒక ప్రామాణిక వ్యవహార పద్ధతి (ఎస్‌.ఓ.పి)ని అనుసరించాల్సి ఉంటుంది. అయితే, ఆ పద్ధతి గురించి చాలామంది పోలీసులకు అవగాహన లేదు. తెలిసినా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ప్రేమికుడితో వెళ్లిపోయి ఉంటారనే పోలీసులుఅభిప్రాయపడడం జరుగు తుంటుంది. ఆ కారణంగానే పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టకపోవడం జరుగుతుంటుంది. యువతులు కిడ్నాప్‌కు గురైనా, అక్రమంగా రవాణా అయిపోయినా ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల మహిళలకు తీరని ముప్పు వాటిల్లుతుంది.
ప్రపంచ దేశాలన్నీ ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చెందుతున్న దశలో ఇటువంటి కేసులను పట్టుకోవడం పోలీసులకు కష్టమేమీ కాదు. అయితే, ఇటువంటి కేసులకు పోలీసులు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి కేసులను దర్యాప్తు చేయడం కోసం రాష్ట్రాల స్థాయిలో తప్పకుండా ప్రత్యేక కార్యాచరణ దళాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో మహిళలు గల్లంతవుతున్నారన్నా, వందల సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయన్నా అది పోలీసుల అసమర్థతకు అర్థం పడుతుంది. ప్రభుత్వాలు ఎంత త్వరగా కొరడా ఝళిపిస్తే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News