ప్రస్తుతం భారతదేశం ప్రతి ఏటా దిగుమతి చేసుకుంటున్న పెట్రోల్/ముడి చమురు 185 మెట్రిక్ టన్నులు, మన దేశీయ వినియోగంలో 86% దిగుమతుల మీదనే ఆదారపడుతున్నాం. ఇందుకోసం మనం చెల్లిస్తున్న విదేశీమారకం 551 బిలియన్ డాలర్లు. రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ /డీజిల్ వాడకం దేశ ఆర్ధిక వ్యవస్థ మీద అంతులేని ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కోకపోతే భవిష్యత్తులో మరింత భారం పెరిగిపోతుంది. ఈ మాటలు ఎవరు చెప్పినా అక్షర సత్యాలే. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ వాడకంతో వాతావరణంలో పెరిగిపోతున్న కార్భాన్ మోనాక్సైడ్ హైడ్రో కార్భన్స్, ఓజోను పొరకు నష్టం చేస్తూ భయపెడుతున్నాయి, వాతావరణాన్ని రక్షించాల్సిన భాద్యత ప్రతిదేశానికీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో పెట్రోలు దిగుమతులు తగ్గించే దిశలో, పర్యావరణాన్ని రక్షించే ఆలోచనతో గత ప్రభుత్వాలు సోలార్ విద్యుత్తును, బయో ఎనర్జీని, ఎలక్ట్రిక్ విద్యుత్తును ప్రోత్సహించే ఎన్నో ప్రణాలికలు చేపట్టడం జరిగింది. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపితే దిగుమతి భారం తగ్గుతుంది, పర్యావరణానికి మేలు జరుగుతుంది అన్న ఆలోచనతో 2006 లోనే అప్పటి ప్రభుత్వం కొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది. 2030 సంవత్సరం నాటికి దేశంలో అన్ని వాహనాలు 20 % ఇథనాల్‌తో నడిచే విధంగా, అందుకు సరిపడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేవిదంగా ప్రనాళికలు రూపొందించిన ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని 2025 నాటికే సాధించాలని తీర్మానించింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం పెట్రోల్ లో 20% ఇథనాల్ కలపడం సాకారమైతే ప్రతి ఏటా 4 బిలియన్ డాలర్ల (30,000 కోట్లు) రూపా యలు మనకు మిగులుతాయి. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్ 674 కోట్ల లీటర్లు. అందులో చెరుకు నుండి 426 కోట్ల లీటర్లు, ఇతర దాన్యాల నుండి 258 కోట్ల లీటర్లు ఉత్పత్తి అవుతున్నది. 2025 నాటికి లక్షాన్ని గనుక చేరుకుంటే ఇందన అవసరాలకు అవసరమయ్యే ఇథనాల్ 1016 కోట్ల లీటర్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందనంగా కాకుండా మద్యం తయారీలో కూడా ఇథనాల్ తప్పనిసరిగా వినియోగించబడుతుంది. అన్ని దేశీయ అవసరాలకుగాను దేశంలో 2025 సంవత్సరం నాటికి 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది, అందుకుగాను పరిశ్రమలను ప్రోత్సహించాలని, అవసరమైన చట్టాలను సవరించాలని నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నది.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌లో 84% అమెరికా, బ్రెజిల్ దేశాలనుండి ఉత్పత్తి అవుతున్నది. భారత దేశంలో ఇప్పటివరకూ ఉత్పత్తి అయ్యే ఇథనాల్ లో 90 % చేరుకుపంట ఆధారంగా జరిగింది. కేవలం మద్యంలో కలపడమే ప్రధాన అవసరంగా కొనసాగడం వలన ఈ విషయమై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదనే చెప్పాలి, కానీ ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తికి ఇతర మార్గాలు వెతుకాల్సిన పరిస్థతి ఏర్పడింది. అందుకు రెండు కారణాలున్నాయి, ఒకటి దేశీయ చెరుకు దిగుబడి ప్రతియేటా 350 నుండి 4000 మిలియన్ మెట్రిక్ టన్నులు, దేశంలో వినియోగామౌతున్న చెక్కర ప్రతియేడు 25 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ లెక్కన చెరుకు సాగుతో 1500 కోట్ల లీటర్ల ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకోవడం సాద్యం కాదు, దీనికి తోడు చెరుకు ద్వారా ఒక లీటరు ఇథనాల్ ను తయారు చేయాలంటే సుమారు 2860 లీటర్ల నీరు అవసరం, ఈ లెక్కన చెరుకు పంటను ఇథనాల్ కోసం ప్రోత్సహిస్తే దేశంలోని వ్యవసాయ నీరుమోత్తం వినియోగించినా సరిపోదు. ఇపటికే దేశంలోని వ్యవసాయ నీటిలో 70% కేవలం చెరకు పంటకు, పరిపంట కోసం వినియోగి స్తున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు వచ్చిన మరో ప్రత్యామ్నాయ మార్గం మొక్కజొన్న, బియ్యం నుండి ఇథనాల్‌ను తయారుచేయడం. ప్రస్తుతం మనదేశంలో ప్రతియేడు 100 నుండి 120 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి, అదేవిధంగా 25 నుండి 30 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతున్నది. బియ్యం ద్వారా ఒక లీటర్ ఇథనాలు ఉత్పత్తి చేయాలంటే 3 కిలోల బియ్యం, 4 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అదే విధంగా మొక్కజొన్న నుండి ఒక లీటర్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి 3 కిలోల మక్కలు, సుపారు 6 లీటర్ల నీరు అవసరం. ఒకవేళ మొక్కజొన్న సాగును పెంచి ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే గనుక ఇప్పుడున్న ఉత్పత్తి ఎందుకూ సరిపోదు, అందుకుగాను ఇంకో 74 లక్షల ఎకరాల భూమిలో మొక్కజొన్న సాగును కొనసాగించాలి, ఇది కనుచూపు మేరలో సాధ్యమయ్యే విషయం కాదు, అందుకే బియ్యాన్ని చెరుకుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా నీతి ఆయోగ్ చెప్పిన సమా చారం. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే వాస్తవానికి చెరుకు నుండి ఒక లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 4 నుండి 6 కిలోల చెరుకు మరియు 1.5 నుండి 2.5 లీటర్ల నీరు అవసరం. ప్రభుత్వం చెప్పిన 2860 లీటర్ల లెక్క ఆ చేరుకును పండించడానికి అవసరమయ్యే నీటిని కూడా కలిపితే వచ్చింది. ఈ లెక్కన ఒక కిలోగ్రాము వడ్లు పండించడానికి అవసరమయ్యే నీరు 1500 నుండి 4000 లీటర్లు. ఒక లీటర్ ఇథనాల్ ను తయారుచేయడానికి అవసరమయ్యే 3 కిలోల బియ్యం కావాలంటే కనీసం 5 కిలోల వడ్లు అవసరం. బియ్యంతో ఒక లీటర్ ఇథనాల్‌ను తయారు చేయడానికి 7500 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ సత్యాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో ఏలిన వారికే తెలియాలి.
బియ్యం నుండి ఇథనాల్‌ను తయారుచేయాలంటే ముందుగా వాటిని పులియబెట్టాలి, అంటే తిరిగి అవి మనకు ఆహారంగా పనికిరావు, కేవలం పశువుల దానాగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదేసమయంలో ఈ ప్రక్రియలో ఉపయోగించిన నీరు అత్యంత కలుషితంగా మారుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మానవాళికి ప్రమాదకారిగా మారే ప్రమాదం ఉన్నది. ఈ.20 (ఇథనాల్ 20%)తో నడిచే వాహనాల ఇంజన్ సామర్థ్యం 6 నుండి 7 % తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమ యంలో ఇథనాల్‌తో నడిచే వాహనాల ధరలు 5 వేల నుం డి 25 వేల వరకూ ఎక్కువగా ఉంటాయి. ఇథనాల్ మీద అదుపు రాష్ట్రాల చేతుల్లోంచి కేంద్రం చేతుల్లోకి వెళ్ళి పోతుంది. బియ్యం నుండి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెడిపోయిన /నూక దాన్యం ద్వారా తీసిన ఇథనాల్ అయితే లీటర్ ఒక్కంటికి 51.55 రూపాయలు, ఎఫ్.సి.ఐ ద్వారా పొందిన బియ్యం ద్వారా తయారుచేస్తే లీటర్ ఒక్కంటికి 56.87 రూపాయలు, దీనికి ప్రభుత్వం జోడించే జీ.ఎస్.టీ అదనం. ఇప్పటి వరకూ ఇథనాల్ పరిశ్రమల స్థాపన కోసం, ఉన్న ప్రరిశ్రమల సామ ర్థ్యాన్ని పెంచడం కోసం వివిధ బ్యాంకుల ద్వారా ప్రభు త్వం అందించిన రుణాలు 20 వేల కోట్లకు పైచిలుకు. ఎక్సైజ్ రూపంలో కేంద్రం కోల్పోయే ఆదాయం 11 వేల కోట్ల రూపాయలు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నిర్మించిన రిజర్వాయర్ల నీటిని మల్లిస్తూ, సంవత్సరాల తరబడి పన్ను రాయితీ ఇస్తూ, 15 సంవత్సరాల కనీస మద్దతు ధరను ముందే ప్రకటిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రాలు వ్యాట్/సేస్ లను కోల్పోతూ, వేలకోట్ల రూపాయలు అప్పుగా ఇస్తూ మార్కెట్ రేటుకన్నా తక్కువగా కేవలం కిలో 20/- రూపాయలకే బియ్యాన్ని అందిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఇథనాల్ ఇందన యజ్ఞం కేవలం 30,000/- కోట్ల రూపాయలు మిగుల్చుకోవడానికేనా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పర్యావరణ హితకారి అనే ఒకేఒక్క కారణం తప్పించి ఇథనాల్ వినియోగాన్ని ఈ పద్దతిలో పెంచడం వలన భారతదేశానికి ఒనగోరే అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నది పై ఘనాంకాలను పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఆయా పరిశ్రమలకు కేటాయించిన నీరు, కేటాయించాల్సిన నీరు వెలకట్టలేనివి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అందుబాటులో ఉన్న చెడిపోయిన/ నూక బియ్యం 40 లక్షల మెట్రక్ టన్నులు. లక్ష్యాన్ని చేరడానికి అవసరమయ్యే దాన్యం 165 లక్షల మెట్రిక్ టన్నులు. ఎఫ్.సే.ఐ లో నిల్వ ఉన్న దాన్యం 170 లక్షల మెట్రిక్ టన్నులు. 30 కోట్ల మంది నిరుపేదలతో, ప్రపంచంలోనే అత్యధిక నిరుపేదలున్న దేశం మనది. 80 కోట్ల భారతీయులు ఇప్పటికీ ప్రజా పంపిణీ ద్వారా అందుతున్న బియ్యం మీదనే ఆదారపడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశం 107 వస్తానంలో ఉన్నది. మన తరువాత కేవలం 14 దేశాలు మాత్రమే ఉన్నాయంటే ఎంత అవమానం. ఏ లెక్కల ప్రకారం చూసినా బియ్యం ద్వారా ఇథనాల్ తయారీని పెద్దఎత్తున, యుద్ద ప్రాతిపదికన ప్రోత్సహించడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కానేకాదు. అమెరికా, బ్రెజిల్ దేశాలు ప్రపంచ ఇథనాల్ ఉత్పత్తిలోని 84 % చేస్తున్నప్పటికీ అందుకు వారు వినియోగించే మొక్కజొన్న, చెరుకు ఆయాదేశాల ప్రధాన ఆహరం ఎంతమాత్రం కాదన్న సత్యాన్ని గుర్తించాలి మనం. ఆయాదేశాల్లో అందుబాటులో ఉన్న వ్యవసాయ భూములు మనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ, అదేసమయంలో మనది ప్రపంచంలోనే అత్యదిక జనాభాను కలిగిన దేశంమన్న వాస్తవాన్ని మనమెప్పుడూ మరువరాదు. ప్రత్యామ్నాయ ఇందనం కోసం, మనం చెల్లించ బోతున్న మూల్యం ఎంతన్నది నేడు మనముందున్న ప్రధాన ప్రశ్న. దేశంలో వివిధ రాష్ట్రాలలోని ప్రజా పంపిణీ బియ్యం పక్కదారిలో ఇథనాల్ పరిశ్రమల్లోకి వెళ్ళకుండా, భవిష్యత్తులో కార్పోరేట్ కబంద హస్తాలలోకి వరి రైతులు వెళ్ళకుండా, కృత్రిమ కొరత మార్కెట్‌ను ముంచెత్తకుండా, ఏవిదమైన చర్యలు చేబట్టబోతున్నారో తెలియజేస్తూ సవివరమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రంమీద ఉన్నది. కూరల్లో వాడే టమాటా ధర పెరిగితేనే అల్లాడిపోతున్నాం, రేపటిరోజు బియ్యం ధరకు రెక్కలోస్తే నిరుపేదల బతుకు ఆగం కాదా.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి.
న్యాయవాది
9440449392