Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Hindi language: కోట్లాది ప్రజల హృదయ స్పందన హిందీ భాష

Hindi language: కోట్లాది ప్రజల హృదయ స్పందన హిందీ భాష

ఈరోజు హిందీ భాషా దినోత్సవం

భారత దేశంలో అధిక సంఖ్యలో మాట్లాడే భాష హిందీ. అనేక రాష్ట్రాల్లో హిందీ బాషలోనే మాట్లాడుతారు. పలకడానికి సులభంగా, అందరికీ అర్ధం అయ్యే బాష హిందీ. అక్షర ఙ్ఞానము లేని వారు కూడ అనర్గళంగా మాట్లాడే భాష హిందీ. పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు హిందీ నేర్పుతారు. పాట్య పుస్తకాలు వున్నాయి. ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతి నుండి హిందీ నేర్పుతూ వున్నారు. హిందీ భాషా దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబరు 14 రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు. దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా రెండు అధికారిక భాషలలో ఒకటిగా భారత రాజ్యాంగ సభచే జరుపుకుంటారు. ఈ మేరకు హిందీకి అనుకూలంగా బీహార్‌ రాజేంద్ర సింహాతో పాటు హజారీ ప్రసాద్‌ ద్వివేది, కాకా కలేల్కర్‌, మైథిలి శరణ్‌ గుప్త్‌, సేథ్‌ గోవింద్‌ దాస్‌లు ర్యాలీలు చేసారు. అందుకని, 1949 సెప్టెంబరు 14న బీహార్‌ రాజేంద్ర సింహా 50వ పుట్టిన రోజున, హిందీని అధికారిక భాషగా స్వీకరించిన తరువాత వారి ప్రయత్నాలు ఫలించాయి. ఈ నిర్ణయం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 343 ప్రకారం, దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. మొత్తం మీద, భారతదేశంలో 22 షెడ్యూల్డ్‌ భాషలు ఉన్నాయి, వాటిలో రెండు అధికారికంగా యూనియన్‌ స్థాయిలో ఉపయోగించబడతాయి. హిందీ, ఇంగ్లీష్‌. ఆధునిక హిందీని నేడు 350 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు. మనదేశంలో కోట్లాది ప్రజల హృదయ స్పందన వినిపించే భాష హిందీ. హిందీ జాతీయ భాషగా, రాజభాషగా, అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 200 విశ్వవిద్యాలయాల్లో హిందీకి సంబంధించి అధ్యయనం, పరిశోధనలు జరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మారిషస్‌, ఫిజీ, జపాన్‌, గయానా, సురినామ్‌, ట్రినిడాడ్, హాలెండ్‌, హాంకాంగ్‌, థాయిలాండ్‌ సింగపూర్‌, జాంబియా, హుడాంగా, కెనడా, హోలాండ్‌ స్విట్జర్‌ లాండ్‌ హంగేరి, రష్యా, చైనా, ఖతర్‌, అమెరికా మొదలగు దేశాల్లో హిందీ గుర్తింపు పొందింది. నేడు అన్ని సామాజిక వర్గాల్లో హిందీ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇందులో విశేషంగా భారతీయ సినిమా రంగం పాత్ర కనిపిస్తుంది. నేడు అమెరికాలో, కెనడా, స్విర్జర్లాండ్‌ మొదలైన దేశాలలో హిందీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది హిందీ నేర్చుకుంటున్నారు. హిందీని శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన శబ్దకోశాలచే సన్నద్ధం చేస్తూ మరోవైపు ప్రసార, ప్రచార రంగాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. సాంకేతిక విజ్ఞానంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో శ్రవ్య, దృశ్య సాధనాల ద్వారా హిందీ ప్రచారంలోనూ ప్రగతిలోనూ విశేషమైన ప్రగతి కనిపిస్తుంది. వార్తలు ప్రసారం చెసే ఛానళ్ళు ఎక్కువగా హిందీలో వున్నాయి. సీరియల్‌, సినిమాలు కూడ ప్రసారం అవుతూవున్నాయి. హిందీ ఒక సమృద్ధమైన, సంపన్నమైన భాష. దీనికి వ్యాకరణం. లిపి, శబ్ద సంపద ఉంది. జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య ఇంగ్లిష్‌, చైనీస్‌ తర్వాత మూడోస్థానంలో ఉంది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీ తన సుస్థిరమైన స్థానాన్ని సాధించింది. ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ నిపుణులు దేవనాగరి లిపిని అత్యధికంగా సమర్థించి స్వీకరించారు. ఒక లక్షా 95 వేల హిందీ శబ్దాలు ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేశారు. కంప్యూటర్‌, మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సినిమా, అన్ని చానల్స్‌ హిందీలో ప్రసారం చేస్తున్నారు. కన్నడ, మలయాళం, తమిళం, ఒరియా, తెలుగు, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, మణిపురి ఇలా భాష ఏదైనా అందరికీ అర్థమయ్యేది హిందీ. హిందీ.. ఇది కేవలం భాష కాదు. కోట్లాది మంది మాట్లాడే భాష. హిందీలో మాట్లాడుతాం, హిందీ భాషని గౌరవించుదాం. హిందీ భాష గొప్పతనాన్ని చాటుదాం.

  • కామిడి సతీష్‌ రెడ్డి,
    తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
    9848445134
    (నేడు హిందీ భాష దినోత్సవం)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News