Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Loksabha Elections 2024:విస్తారక్స్, గావ్ గావ్ చలో, ఘర్ ఘర్ చలో, రాత్రి ప్రవాస్ బీజేపీ...

Loksabha Elections 2024:విస్తారక్స్, గావ్ గావ్ చలో, ఘర్ ఘర్ చలో, రాత్రి ప్రవాస్ బీజేపీ నయా అస్త్రాలు

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ భారీగా సన్నాహకాలు చేస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని దేశం నలుదిశలా విస్తరించేలా, కొత్త చేరికలతో పార్టీకి కొత్త జవసత్వాలు తొడిగేందుకు కమలనాథులు భారీ స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా 3000- 3,500 మంది ‘విస్తారక్స్ ‘ (పార్టీని విస్తరించేవారు) మోహరించేలా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది జరుగనున్న ఎన్నికలతోపాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేలా ఈ మెగా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, త్రిపుర, కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతో చాలా దూకుడు ప్రదర్శిస్తోంది కాషాయ పార్టీ.

ఈ 9 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరో రెండు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ పనుల్లో చరుకైన పాత్ర పోషించేలా ఈ విస్తారక్స్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో కింది స్థాయి వరకు ఈ విస్తారక్స్ చొచ్చుకుని పోయి, పార్టీకి మెజార్టీ వచ్చేలా కృషి చేసి, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మెరుగుదల తెచ్చేందుకు దోహదం చేస్తారు. ఈ విస్తారక్స్ డైరెక్ట్ గా సెంట్రల్ లీడర్షిప్ కే రిపోర్ట్ చేస్తారు కాబట్టి క్షేత్రస్థాయిలో చీమ చిటుక్కుమన్నా అధిష్ఠానానికి రియల్ టైంలో తెలిసిపోతుంది.

స్థానిక బీజేపీ నేతలతో కలిసిమెలిసి వీరు పనిచేస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపోటములపై బలాబలాలపై గ్రౌండ్ రిపోర్ట్ ను ఈ విస్తారక్స్ తయారు చేసి, అధిష్ఠానానికి పంపుతారన్నమాట. తెలంగాణలో ఇప్పటికే 119 అసెంబ్లీ స్థానాల్లో విస్తారక్స్ ను పార్టీ నియమించింది.

కొద్ది రోజుల క్రితమే బీజేపీ బలహీనంగా ఉన్న160 లోక్సభ నియోజకవర్గాల్లో విస్తారక్స్ ను పార్టీ నియమించింది కూడా. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా, అందరికీ పార్టీ అజెండా ఏంటో తెలిసేలా చేసేందుకు బీజేపీ చాలా సమయం, మొత్తాన్ని వెచ్చిస్తోంది. గడప గడపకూ, ప్రతి వ్యక్తికీ బీజేపీ సిద్ధాంతం, బీజేపీ అజెండా, బీజేపీ జెండాను చేరువ చేసేలా ఈ భారీ ప్రణాళికను అమలు జరుపుతోంది .

లోక్సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ఉండగానే చురుగ్గా కదులుతున్న బీజేపీ రాజకీయాలపై తమ పట్టు పెంచుకుని, కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ‘గావ్ గావ్ చలో, ఘర్ ఘర్ చలో’ అనే కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దుతోంది పార్టీ ఓబీసీ మోర్చా. మార్చ్-ఏప్రిల్ లో ఈ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వల్ల వారిని ఆకర్షించేలా ఈ ఓబీసీ మోర్చా ఉద్యమం సరికొత్తగా ప్రారంభమైంది. ఎన్నికలు జరుగనున్న 9 రాష్ట్రాల్లో ఓబీసీలను పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసినా బీజేపీ గెలుపు కేక్ వాకే. దీని ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఎలాగూ సానుకూలంగానే ఉంటుందని అధిష్ఠానం లెక్కలేస్తోంది. ఈ ఓబీసీ ఓట్ బ్యాంక్ ను క్లీన్ స్వీప్ చేయగలిగితే చాలు 9 రాష్ట్రాల్లోనూ రాజకీయంగా తమదే పై చేయి ఉండేలా చేసుకోగలదు బీజేపీ.

ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న 9 రాష్ట్రాల్లోనూ ఓబీసీ ఓటర్ల జనాభా కనీసం 40-50 శాతం వరకూ ఉంది. కాబట్టి ఆపరేషన్ ఓబీసీ అనేది వీరి ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. పైగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి వీరిని ఆకట్టుకోవటం తమకు ఈజీ అని భారతీయ జనతా పార్టీ బలంగా విశ్వసిస్తోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సైతం బీసీలే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి బీసీ మంత్రంతో రాజకీయాలు గెలవటం ఈజీ అనేది కమలనాథుల సిద్ధాంతంగా మారింది.

అందుకే మార్చ్-ఏప్రిల్ మధ్య కాలంలో జరిగే ఈ గావ్ గావ్ చలో ఘర్ ఘర్ చలో యాత్ర ద్వారా ఓబీసీలను పార్టీవైపు లాక్కోవటం మరో అస్త్రం. ఇప్పటికే నీట్ వంటి చోట్ల 27 శాతం, సెంట్రల్ ఎడ్యుకేషన్ స్కీముల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయటం వెనుకున్న దీర్ఘ కాలిక ప్రణాళిక ఇదే. ఓబీసీ నేషనల్ వర్కింగ్ కమిటీ ఈమేరకు తమ కార్యకర్తల బలాన్ని గ్రామ గ్రామాన మోహరించి.. కేంద్ర ప్రభుత్వం ఈ సామాజిక వర్గానికి చేసిన మేలు, పథకాలు, సంక్షేమాల గురించి ప్రచారం చేసి, కరపత్రాలు పంచేలా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది బీజేపీ. ఈ నెలాఖరున ఓబీసీ మోర్చా కీలక భేటీ హర్యానాలో జరగనుంది..ఈ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో మరింత లోతైన ప్రణాళికకు తుది మెరుగులు దిద్ది అమలు చేయటం మొదలు పెట్టడాన్ని పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది.

గత ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన 144 లోక్ సభ నియోజక వర్గాలపై బీజేపీ కన్నేసింది. వీటిలో ఎలాగైనా గెలిచి, అక్కడ బీజేపీ జెండా ఎగరేసేందుకు బీజేపీ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ ఓ భారీ ప్రెజెంటేషన్ కూడా పార్టీ వర్గాలకు చేశారు. ఈ 144 నియోజకవర్గాలను కొందరు కేంద్ర మంత్రులకు పంచగా, వారు ఈ నియోజక వర్గాల్లో విస్తృతంగా తిరిగి, ప్రచారాన్ని ఉధృతం చేయటం ఇందులో ఒక కీలక వ్యూహం. దీంతో ఈ 144 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలోని మొత్తం అసెంబ్లీ స్థానాలన్నీ క్లీన్ స్వీప్ చేసినట్టైతే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగుండదు అనేది ఇందులోని అసలు ఆంతర్యం.

మరో 18 నెలలపాటు 144 లోక్ సభ స్థానాల్లో పనిచేసేందుకు బీజేపీ మూడు అంచెలుగా నేతలను మోహరించనుంది. ఈ మొత్తం కార్యక్రమం కేంద్ర మంత్రుల కనుసన్నల్లో సాగుతుంది. కేంద్ర మంత్రుల కింద స్టేట్ కమిటీలుంటాయి. చివరి, మూడవ స్థాయిలో క్లస్టర్ కమిటీలు గడపగడపకూ తిరిగేలా వ్యూహం రచించింది పార్టీ. ఈ క్లస్టర్ కమిటీలు డైరెక్ట్ గా కేంద్ర మంత్రుల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ భారీ ప్రణాళికలో భాగంగా కేంద్ర మంత్రులంతా తమకు కేటాయించిన లోక్ సభ నియోజక వర్గంలో ప్రతి 15 రోజుల్లో ఒకసారి స్థానికంగా మకాం వేసి ఓ రాత్రి కూడా అక్కడే గడుపుతారు. అలా ప్రతి లోక్ సభ స్థానం కింద వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒక రాత్రి స్వయంగా ఉండి పార్టీ కార్యకర్తల్లో, స్థానిక లీడర్లో ఉత్సాహం పెంచేలా కార్యక్రమాలు చేపడతారు. దీన్ని ‘రాత్రి ప్రవాస్’ (రాత్రి మకా వేయడం) అంటారు.

ఇక ప్రతి లోక్ సభ స్థానాల్లోనూ ఉన్న ఓటర్ల సామాజిక, ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులను బేరీజు వేస్తూ పలు రకాల రిపోర్టులతో కూడిన డేటాను సేకరించి, అందుబాటులో ఉంచడం మరో ఎత్తు. ఇదంతా 144 లోక్ సభ స్థానాల్లోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో చేయాల్సిందే అన్నది కమలనాథుల ప్లాన్. దీంతో ఆయా వర్గాలకు చెందిన వ్యక్తులను పార్టీ వైపు ఆకర్షించి, వారిని ఉద్దేశించిన ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల్లో గెలవటం చివరి లక్ష్యంగా పార్టీ నిర్దేశించింది.

ఇక తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నెలా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం మరో ఎత్తు. ప్రతి లోక్ సభ స్థానానికి ఒక ప్రత్యేక మీడియా ఇంఛార్జ్ ఉంటారు. వీరు లోకల్ మీడియాతో నిత్యం టచ్ లో ఉంటూ తమకు అనుకూలంగా ప్రకటనలు, వార్తలు కవర్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.

ఈ ఏడాది చివరికల్లా 144లోక్ సభ స్థానాల్లోని ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం 50,000 మంది ఫాలోయర్స్ బీజేపీ సోషల్ మీడియాలో చేరేలా టార్గెట్ కూడా పెట్టుకుంది పార్టీ. దీనికి తోడు పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా అన్ని రకాల ఓటరు గ్రూపులకు చేరువయ్యేలా, యవత, సంక్షమే పథక లబ్దిదారులు వంటి వారందరికీ కేంద్ర మంత్రులు భేటీ అయ్యేలా చూసుకోవటం

మరో ప్రోగ్రాం. అంతేకాదు సెల్ఫీలను అప్ లోడ్ చేయటం కూడా కేంద్ర మంత్రుల విధి. కాబట్టి స్థానికంగా ఉన్న సామాన్యులు, ప్రముఖులతో సెల్ఫీలు తీసుకుని కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేయాల్సిందే. ఈ దిశగా జూన్ నుంచి నెక్ట్స్ లెవెల్ ప్రచారం తారాస్థాయికి తీసుకెళ్లటం బీజేపీ సోషల్ మీడియా ఎత్తుగడ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News