Saturday, May 25, 2024
Homeఓపన్ పేజ్Moditva is the BJP Manifesto!: మేనిఫెస్టో అంతా మోదీ మయం!

Moditva is the BJP Manifesto!: మేనిఫెస్టో అంతా మోదీ మయం!

కమ్యూనికేషన్‌ లో ముందు

లోక్‌ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పార్టీ కంటే నరేంద్ర మోదీయే ఎక్కువగా కనిపించారు. మేనిఫెస్టోలో మోదీ గ్యారంటీలనే ఎక్కువగా పేర్కొనడం జరిగింది. ప్రజల ఆశయాలను నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన తమ మేని ఫెస్టోలో స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు. జి.ఎస్‌.టి వంటి సంస్కరణలను ప్రవేశపెట్టడం, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం వంటి చర్యలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన సౌకర్యాలను విశేషంగా తెలియజేయడం జరిగింది. పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, నిత్యావసర వస్తువుల ఉచిత సరఫరా వంటి పథకాల గురించి, మరింత మందికి వాటిని విస్తరించడం గురించి విపులంగా తెలియజేశారు. తాము మూడవసారి కూడా అధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటు నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.
తాము అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేయదలచుకున్నామని తెలియజేస్తూ, బులెట్‌ రైళ్లను, మరింత ఎక్కువ సంఖ్యలో వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా తెలియజేశారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రపంచంలో పదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి అయిదవ స్థానానికి తీసుకు వచ్చినట్టు బీజేపీ తెలిపింది. ఏ పార్టీ మేనిఫెస్టో అయినా అనేక వాగ్దానాలను చేయడం జరుగుతుంది. వాటిని నిలబెట్టుకోవడం మీద అంతా ఆధారపడి ఉంది. ఈ మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ ఎంత వరకూ అమలు చేసిందన్నదాన్ని బట్టి దాని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
దేశంలోని ఉద్యోగాల పరిస్థితి గురించి గానీ, ధరల పెరుగుదల గురించి కానీ మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొన లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోదీ పదేళ్ల పాలనలో కంటే మన్మోహన్‌ సింగ్‌ పదేళ్ల హయాంలో జీడీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుచేశాయి. ఉద్యోగాలను సృష్టించడం జరగలేదని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని కూడా నెరవేర్చ లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. విచిత్రమేమిటంటే, ఇప్పుడు పార్టీలు వాగ్దానాలు చేయడం లేదు. గ్యారంటీలను మాత్రమే ప్రకటిస్తున్నాయి. నిజానికి, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు 2014లో చేసిన వాగ్దానాలనే మళ్లీ 2024లో కూడా చేశాయి. దేశాన్ని ఆర్థికాభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తా మని బీజేపీ వాగ్దానం చేసింది. సెమీ కండక్టర్లు, విద్యుత్‌ వాహనాల పరిశ్రమలు, స్టార్టప్పులకు భారీగా నిధులు వంటి కొత్త వాగ్దానాలు ఈసారి ఇందులో చేరాయి. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి మాదిరిగానే సంక్షేమ పథకాల మీదే దృష్టి కేంద్రీకరించింది. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి పథకాల మీద ఇది దృష్టి పెట్టింది. భారతదేశం గత పదేళ్ల కాలంలో జి.డి.పి వృద్ధిని చూసినప్పటికీ, పేదలు, సంపన్నుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఎక్కువగా సంక్షేమ పథకాల పైనా, ఉపాధి హామీ వంటి కార్యక్రమాలపైనా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

- Advertisement -


దేశంలో విస్తృతంగా రాజకీయ ఏకీకరణలు జరుగుతుండడం, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతుండడం వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వ తీరుతెన్నుల మీద ప్రజలు ప్రధానంగా తీర్పునిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి, దేశ ద్రోహాలు, నల్లధనం వంటి అంశాలనే కాక, ప్రజాస్వామ్య సంస్థల దుర్వి నియోగం వంటి అంశాలను కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారని బీజేపీ ఇందుకు ప్రతిగా వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా బీజేపీ ధాటిని ఎదుర్కోవడం, దానితో పోటీకి దిగడం వంటి విషయాల్లో కాంగ్రెస్‌ బాగా వెనుకబడే ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాల కంటే బీజేపీ కమ్యూనికేషన్‌ నైపుణ్యాల విషయాల్లో బాగా ముందుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News