Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Sahithi vanam: సాహితీ స్రష్ట కళాప్రపూర్ణ దువ్వూరి

Sahithi vanam: సాహితీ స్రష్ట కళాప్రపూర్ణ దువ్వూరి

ఆయనకు సాటి తెలుగునాట మరొకరు లేరు

ఆయన మాదిరిగా సంస్కృత, ఆంధ్ర వ్యాకరణాల మీద శ్రద్ధ చూపించిన ‘గురువు’ చాలా అరుదు. సాహిత్యానికి రెండు కళ్లలాంటి ఈ రెండు భాషల వ్యాకరణాలను పరిపుష్టం చేసి, ప్రాథమిక విద్యార్థులకు సైతం అర్థమయ్యేలా సరళతరం చేసేపక్షంలో తెలుగునాట తెలుగు సాహిత్యం నిత్యకల్యాణం పచ్చతోరణంలా వెలిగిపోవడం ఖాయమని ఆయన భావించారు. తూర్పు గోదావరి జిల్లా మసకపల్లి గ్రామంలో 1897లో జన్మించిన కళాప్రపూర్ణ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి తన జీవిత కాలంలో ఎక్కువ భాగాన్ని ఈ రెండు భాషల వ్యాకరణాలను విద్యార్థులకు సరళ, వ్యావహారిక భాషలో బోధించడానికే అంకితం చేశారు. తద్వారా తెలుగునాట వేలాది మంది సాహితీవేత్తలను సృష్టించి, సాహిత్యపరంగా ఒక గురువు స్థానంలో నిలిచారు. సంస్కృత, తెలుగు భాషల్లో సాహితీ సంపదను కూడా సృష్టించిన దువ్వూరికి సాటి రాగల సాహితీ స్రష్ట తెలుగునాట మరొకరు లేరంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఉభయ భాషల్లో అద్వితీయమైన పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని సంపాదించిన దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఒక పక్క సాహితీ సేవ చేస్తూనే సుమారు ఆరు దశాబ్దాల పాటు విశాఖపట్నం, గుంటూరు పట్టణాల్లో విద్యార్థులను, శిష్యులను తీర్చిదిద్దడా నికే జీవితాన్ని అంకితం చేశారు.
తెలుగు వ్యాకరణాన్ని విద్యార్థులకు సన్నిహితం చేస్తూ ఆయన రాసిన ‘రమణీయం’ అనే వ్యాకరణ గ్రంథం ఇప్పటికీ ప్రామాణిక గ్రంథంగా కొనసాగుతోంది. గత శతాబ్దంలో ఆ గ్రంథాన్ని అనుసరించని విద్యార్థి లేడంటే ఆశ్చర్యమేమీ లేదు. విద్యార్థులకే కాదు, సాహితీవేత్తలకు సైతం అదొక ప్రామాణిక గ్రంథంగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన పింగళి సూరన రాసిన ‘కళాపూర్ణోదయం’ కావ్యాన్ని ‘మధుర లాలస’ పేరుతో తెలుగులోకి అనువదించినప్పుడు ఆ గ్రంథం మూల గ్రంథాన్ని మించి సాహితీవేత్తలను చదివించింది. పలువురు కవులు, గ్రంథ రచయితలు పింగళి సూరన గ్రంథం కంటే మధుర లాలస గ్రంథమే అత్యంత మధురంగా ఉందనే కితాబు కూడా ఇవ్వడం జరిగింది. అది అనువాద భాషకు కూడా ఒక కొత్త ఒరవడి దిద్దింది. ఆ తర్వాత ఆయన రాసిన ఆత్మకథ తెలుగునాట విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. అందులోని భాష ఒక ఎత్తు కాగా, అందులోని అంశాలు మరొక ఎత్తు. లక్షలాది మంది తెలుగు భాషాభిమానుల్ని ఆ గ్రంథం ఆకట్టుకుంది. అందులో ఆయన తన సొంత జీవితం గురించి అతి తక్కువగానూ, తన ఉపాధ్యాయుల గురించి, తన గురువుల గురించి, తన తోటి సాహితీవేత్తల గురించి, తన శిష్యుల గురించి ఎక్కువగానూ రాయడం జరిగింది.
అందులో ఆయన పుట్టుక గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి తక్కువగా ప్రస్తావించడం నిరుత్సాహం, అసంతృప్తి కలిగించే అంశమే అయినప్పటికీ, ఆయన సమకాలీన రచయితలు, గ్రంథకర్తలు, సాహితీవేత్తల గురించి రాసిన విషయాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఆయన శిష్యులు ఆయనను ఒక గురువుగానే కాక, దైవంగా కూడా భావిస్తారు. వ్యక్తిగత శ్రద్ధతో ఆయన తన విద్యార్థులను, శిష్యులను తీర్చిదిద్దిన తీరు నిజంగా ఆయనను ఒక గురు బ్రహ్మ స్థానంలో నిలబెడతాయి. విద్యార్థుల చేతి రాతను అందంగా తీర్చిదిద్దడానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అదే తమను ఆ తర్వాత అందలాలు ఎక్కించిందని, తమను ఉన్నత స్థానాల్లో నిలబెట్టిందని విద్యార్థులు, శిష్యులు చెబుతుంటారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషాభిమానాన్ని విపరీతంగా పెంచి పోషించిన అతి కొద్దిమంది తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు సాహితీవేత్తల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఆయన 1972లో గుంటూరులో కాలధర్మం చెందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News