Saturday, May 4, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: ‘అబ్బూరి’ వ్యాస పరిమళం

Telugu literature: ‘అబ్బూరి’ వ్యాస పరిమళం

అలా బైరాగి కవిగా..

“ఆహ్లాదజనకత్వము లేక, విషయ ప్రధానములయ్యు మనోహరమైన శైలిలో వ్రాయబడిన కొన్ని రచనలు సాహిత్య కక్ష్యకు చేరును. అంత మాత్రమున అవి కావ్యములు కాజాలవు. అవియే వ్యాసములు” …‘పింగళి లక్ష్మీకాంతం’ తన ‘సాహిత్య శిల్పసమీక్ష’ లో ఉటంకించిన నిర్వచనమిది. దీనిని బట్టి ‘విషయం’ వ్యాసం యొక్క ప్రధాన లక్షణం. ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయడమే వ్యాసము. వ్యాసరచన విజ్ఞానానికి, సృజనాత్మకతకు, తార్కికతకు ప్రతీకగా నిలవాలి. పాఠకుని హృదయాంతరాలలో ఒక విధమైన అనుభూతి కలిగించేలా ఉండాలి. ఆ వ్యాసాన్ని ఆమూలాగ్రం ఉత్సుకతతో పాఠకుడు చదివేలా ఆకట్టుకోబడాలి. దానికి రచయిత శైలీ నిర్మాణమే ప్రధానం. ఇంకా కళాత్మకత జోడిస్తే వ్యాసం సృజన ప్రక్రియకు ఏమాత్రం తీసిపోదు. ఇలాంటి విశిష్ట లక్షణాలు గల వ్యాస సంపుటియే ‘అబ్బూరి వరదరాజేశ్వరరావు’ రచించిన కవనకుతూహలం. అందులోని కొన్నింటిని సంక్షిప్తంగా పరిచయం చేయడమే ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశం.
‘ఆలూరి బైరాగి’ మొదట్లో రచనలు చేయలేదు. స్నేహితుల మధ్య ఉంటూ చర్చల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఒకరోజు చర్చిస్తుండగా కవిరాజు త్రిపురనేనిని విమర్శించాడు. దానికి పి.వి సుబ్బారావుకి కోపం వచ్చింది. అప్పుడు మేము ఇంటి ముఖం పట్టేటప్పుడు ‘నాకు రాయాల్నుందిరా ఇప్పుడు’ అని అన్నాడు నాతో. అప్పటికి కొన్నాళ్ళు ముందే నేను అతన్ని రాయమని పురమాయించాను. సరే రాయి అని అన్నాను. కొన్నాళ్ళకు వరదా..వరదా.. అంటూ అరుస్తున్నాడు. అంతే మేడ దిగాను. కాసేపు బయటికిరా అన్నాడు బైరాగి. ఇదిగో నేను రాశాను నువ్వు చదివి చెప్పు అన్నాడు. అది చదివి అద్భుతంగా ఉందన్నాను. అలా బైరాగి కవి అయ్యాడు. ఇలా తన వ్యాసంలో బైరాగితో గడిపిన అనుభవాలను వరద ఆప్యాయంగా చెప్తారు.
విశాఖపట్నంలో కవితా సమితి వార్షికోత్సవంలో గిడుగు వారి ఉపన్యాసమయ్యాక కవుల కావ్యపఠనం జరిగింది. అక్కడ వరద రాసిన గేయ కవితొకటి పాడుతున్నాడొకరు. ఈలోగా వరద వచ్చి హాలులో కూర్చున్నారు. అదిగో ఆ కూర్చుంటున్న కుర్రాడే ఈ పాటను రాశాడని సభకు పరిచయం చేశారు ఆ గాయకుడు. అతనే నారాయణబాబు. మెడ దిగజారిన చుట్టూ, చెంపల మీదికి నున్నగా దువ్వుకున్న గిరజాలు, చిన్న చిక్కని మీసం, కళ్ళకి జోడు, ఛాతీకి ఎడం వైపు కాజాలతో లాల్చీ, బెంగాలీ ధోవతీని ధరించి ఉన్నాడతను. ఆ రోజుల్లో పద్యాన్ని గేయాన్ని చక్కగా పాడగలిగే వ్యక్తని అతనికి పేరుండేది. ఆ రోజుల్లో శ్రీశ్రీ అంటే ఈర్ష్యపడే వారంతా నారాయణబాబుని అందలమెక్కించేవారు. నారాయణబాబు కూడా తనకు తాను కవితా విప్లవానికి ముందస్తు నాంది పలికినవానిగా భావించేవాడు. కానీ నాకు మాత్రం అతని కవిత్వం మీద అంత అభిప్రాయం లేదని, అదే అభిప్రాయాన్ని నేరుగా నారాయణబాబు ముందే పెట్టానంటారు వరద. ఐనప్పటికీ నారాయణబాబు తనకు మంచి స్నేహితుడని గుర్తుకు తెచ్చుకున్నారు వరద.
ఓసారి విశాఖపట్నంలో శివాలయం వీధికి ఆనుకొని ఉన్న ఖద్దరు దుకాణానికి వరద కుటుంబమంతా వెళ్లారు. ఆ దుకాణ యజమాని మీసాలు, ఎడం వైపు పాపిటి దువ్విన జుట్టు, కొంచెం కళ్ళు పెద్దవి, విశాలమైన ముఖం కలిగి ఉన్నారు. ఆయన ముందు నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారు. అప్పుడు రామకృష్ణారావు తనకు కావలసిన బట్ట కొన్నారు. వాళ్ళు రసీదుపై పేరు రాయమని అడిగితే అబ్బూరి రామకృష్ణారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు అని రాశారు. దాన్ని గమనించిన వాళ్లు, బండి ఎక్కి వెళ్ళిపోతున్న అబ్బూరి వారికి నమస్కారం చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు. అలా పురిపండా అప్పలస్వామి ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. తర్వాత కాలంలో పురిపండ ఎంతగానో సాహిత్య క్షేత్రంలో తనను ప్రోత్సహించేవారని వరద స్వయంగా చెప్పుకొచ్చేవారు. భావ కవిత్వ ధోరణిలో పద్యాలు రాస్తారని, ప్రణయం విరహం వేదన ఇత్యాది ఎక్కువగా అతనిది కృష్ణశాస్త్రి ప్రభావమని, సాహిత్యానికి అంకితమైన జీవి అని పురిపండపై వరద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. నన్ను ప్రోత్సహించినట్లే పురిపండ ఎంతోమంది రచయితలను ప్రోత్సహించే వారిని, వారిలో శ్రీశ్రీ ఒకడని వరద రాశారు. అదే కాక అప్పలస్వామి పద్య రచన మానేసి మాత్రాఛందస్సులలో ప్రయోగాలు చేశారని, ఈ క్రమంలో ‘మల్లెమడుగు’ అనే గేయం నాలుగు కాలాల పాటు నిలిచే శక్తి గలదంటారు వరద.
ఉప్పు సత్యాగ్రహం ఆరంభమైన రోజుల్లో అబ్బూరి వారి కుటుంబ సభ్యులంతా ఖద్దరు దుస్తులు ధరించేవారు. వరద తల్లిగారు బెజవాడలో అయ్యదేవర దుర్గమ్మ నాయకత్వం కింద సత్యాగ్రహం చేశారు. అందువల్ల వారి ఇంట్లో రాట్నం, తకిలీలు ఉండేవి. పిల్లలతో సహా పెద్దలంతా నూలువడికేవారు. అలా వడికిన దాన్ని రామకృష్ణారావు గారు తీసుకుపోయి గుడ్డగా తయారుచేయించేవారు. అందువల్ల పిల్లలంతా చొక్కాలు, లాగులు ఆ గుడ్డతోనే కుట్టించుకునేవారు. అలా ఆ ఖద్దరు బట్టలను ధరించి వీధిలో తిరగడం అంటే వారంతా గర్వకారణంగా భావించేవారు. అంటే అప్పటికే ఉధృతంగా ఉన్న జాతీయోద్యమం ప్రభావం మా కుటుంబం మీద కూడా గాఢంగా ముద్ర వేసుకుందని వరద తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ కు పోయి ఫోన్ చేస్తే, సదరు వ్యక్తి చిరునామా చెబితే, ఆ వ్యక్తిని పోస్ట్ ఆఫీస్ కు పిలిచిన తరువాత ఫోన్ లో మాట్లాడించేవారు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు. అలా ఆ రోజుల్లో ఫోన్ సంభాషణ జరిగేదన్నమాట. ఓసారి కాకినాడలో ఉన్న కృష్ణశాస్త్రి గారితో అలానే సంభాషించినట్లు వరద గుర్తుకు చేసుకుంటారు. ఆనాటి సమాచార సాంకేతిక వ్యవస్థకొక ఉదాహరణిది.
బెజవాడ స్టేషన్ తో వరదకు గొప్ప అనుభవాలు ఉన్నాయి. వెంకటాచలం గారితో రైల్వే స్టేషన్ లో గడిపిన క్షణాలు మధురాతి మధురం. అక్కడ చలం ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంటే వరద చక్కగా వినేవారు. తద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందేవారు. ఆయన మాటలను తన్మయత్వంతో వింటూ, అలా ఏమీ మాట్లాడకుండా చిత్తరువులా ఉండేవారు. అలాగే చింతా దీక్షితులు, నండూరి సుబ్బారావు గార్లను కూడా పలుమార్లు రైలు ఎక్కించడానికి స్టేషన్ కి వెళ్లడం, అలా స్టేషన్ లో రైలు వచ్చేవరకు కబుర్లు చెప్పుకుంటూ ఉండడం జరిగేది. ఇంకా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో మూడేళ్ల పాటు సాయంత్రం స్టేషన్ లో షికారుకు వెళ్లడముండేది. ఇదంతా బెజవాడ రైల్వేస్టేషన్ ను చూసినప్పుడల్లా గుర్తుకు రావడం మామూలే అయ్యిందంటారు వరద.
పాలగుమ్మి పద్మరాజును, వరదకి రాజమండ్రి స్టేషన్లో ములుకుట్ల వేంకటశాస్త్రి పరిచయం చేసారు. శాస్త్రి వరద వంక చూస్తూ…’పద్మరాజు మీద ఓ రెండు పంక్తులు చెప్పు, ఓ బీరు కొనిపెడతారన్నారు. దానికి నేను బీరు తాగను కదా! అని అన్నారు. వెంటనే పద్మరాజు కల్పించుకుని నాకిద్దువులే అని అన్నారు. ‘వీడెవరి పా.ప.రా/ఊయేల ఊపరా/చనుబాలె చేపరా’ అనేసారికి పక్కనించి వరద వీపు పద్మరాజు తట్టి ‘వెంకన్న కొరేను/మనకింక బీరేను’ అని ముగించారు. అంతే అక్కడ నవ్వులు ఒక్కసారిగా విరిసాయి. ’పద్మరాజు దాదాపు బాల్య దశలోనే కవితాభ్యాసం చేశాడు. తరువాత కవిత్వం మీద ఎంత మోజు ఉండేదో! అంత తక్కువ రాశాడు. వచనంలో కథా ప్రక్రియను అవలంబించి అందులో అపార ప్రావీణ్యం, ప్రతిష్ట ఆర్జించాడు. విశ్వవిఖ్యాతి పొందారు’ పాలగుమ్మి పై వరద అభిప్రాయమిది.
ఓసారి హైదరాబాదులో రాయప్రోలు రాజశేఖర్ ని చూపిస్తూ…రాయప్రోలు సుబ్బారావు గారి కొడుకు ఈయనేనని శ్రీశ్రీ, వరదకు పరిచయం చేశారు. పొట్టిగా, సన్నని కళ్లద్దాలూ, గిరజాల్లాంటి జుట్టుతో ఉండే రాజశేఖర్ చక్కగా ఇంగ్లీషులో పద్యాలు రాస్తాడని చెప్పారు. రాజశేఖర్ మరలా నాలుగేళ్ల తర్వాత హైదరాబాదులోనే తారసపడ్డాడు వరదకు. అలా మరో ఆరేళ్ల పాటు ఆ ఇద్దరితో అజంతా, ఏల్చూరి రోజూ సమావేశమయ్యేవారు. రామదాసు, శ్రీశ్రీ, ఆరుద్ర, మాచిరాజు దేవీప్రసాద్, బైరాగిలు ఊళ్లోకొచ్చినప్పుడల్లా వారితో కాలక్షేపం చేసేవారు. ‘అతని పేరు చాలామందికి తెలియదు. తెలుగు సాహిత్య ప్రపంచంలో. అది వాళ్ళ కర్మ. అతని పేరు రాయప్రోలు రాజశేఖర్ అని వరద అనేవారు.
విశాఖలో కోటకూ-హార్బర్ కు పోయేదారిలో కన్యకా పరమేశ్వరి దేవాలయముంది. ఆ దేవాలయం పూజారి స్థానాపతి సత్యనారాయణ శాస్త్రి. గుడి దగ్గరలోనే కురుపాం మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ కు లోపల ఎడమ వైపున గ్రంథాలయమొకటి ఉండేది. అప్పుడప్పుడు వరద అక్కడికి వెళ్లేవారు. సెట్టి లక్ష్మీనరసింహం కూడా అక్కడికి వచ్చేవారు. నీ పేరేమిటి బాబూ? అని వరదను ఓసారి అడిగారు. చెప్పగా అబ్బూరి వారబ్బాయవా! అని పలుకరించారు. వసుచరిత్ర తీసి ఇచ్చి ఓ పద్యం చదివి అర్థం చెప్పగలవా? అని అన్నారు. వరద చెప్పగా సెట్టి మాస్టారు సంతోషించారు. పద్య నిర్మాణంలో సౌందర్యం చూడాలంటే వసు చరిత్రలోనే చూడాలని ఆయన అనేవారు. సెట్టి వారు వ్యవహారిక భాషావాది. అయినప్పటికీ కవిత్వం గ్రాంథికంలోనే ఉండాలనేవారు. ఎందుకని వరద అడిగితే, గద్య ప్రయోజనం వేరు. ప్రజలకీ, వచనానికి ప్రాణ స్నేహం. కవిత్వం ప్రయోజనం వేరు. కవిత్వం ఆనందించాలంటే ఒక రకమైన సంస్కారం, ఏకాగ్రతా, భాషా ప్రావీణ్యం కనీసం ఉండి ఉండాలనేవారు. ఆ రోజుల్లో వరదకు అది నిజమనిపించేది. కానీ శ్రీశ్రీ అంగీకరించేవారు కాదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసులో అబ్బూరి రామకృష్ణారావు ‘నటాలి’ అనే నాటక సంస్థను స్థాపించారు. అక్కడ కన్యాశుల్కం నాటక ప్రదర్శన అప్పుడప్పుడూ జరిగేది. అందులో అగ్నిహోత్రావధానుల పాత్రను బలిజేపల్లి లక్ష్మీకాంతం వారు వేసేవారు. ఓసారి వరద, బలిజేపల్లి కలిసి మధురవాణి పాత్ర కోసం నటిని వెతికేందుకు రాజమండ్రి వెళ్లారు. అప్పుడొక జట్కాబండి ఎక్కారు. జట్కా వేగం పుంజుకుంది. బండి నడిపేవాడు గట్టిగా ‘తిరమై సంపదలెల్ల’ అంటూ పద్యమందుకున్నాడు. బలిజేపల్లి విభ్రమాశ్చర్యంతో వింటున్నారు. జట్కావాడు ‘నిన్నరాత్రి తస్సదియ్యా! ఏం చదివాడండి సుబ్బారావ్, హాలంతా కళ్ళనీళ్ళేనండీ పారిందండీ, వాడి దుంపతెగా’ అన్నాడు. బలిజేపల్లి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. పద్యంలో రహస్యం అదే. నాది ప్రజల కవిత్వం అయిందని సంతోషపడ్డారు. ఏ కవికైనా ఇంతకన్నా కావాల్సిందేముంది? అని వరద ఆ క్షణాన అనుకున్నాడు.
రామకృష్ణారావు ఎ.యు గ్రంథాలయాధికారిగా ఉన్నప్పుడు, దువ్వూరి రామిరెడ్డి వచ్చారు. ఆయనకు వరదను పరిచయం చేశారు. దువ్వూరి మాట్లాడుతుంటే ఏదో రహస్యం చెబుతున్నట్లుండేది. మాట మెత్తన. వినయ సంపన్నమైన మనస్సు. ‘కవిత్వానికి కేవలం భాష మీద అధికారం సంపాయించడమే చాలదు, భావనాశబలత పుష్కలంగా ఉండడమే చాలదు, ఛందస్సులో అనితరసాధ్యమైన ప్రావీణ్యం సంపాయించడమూ చాలదు. ఈ మూడూ సమస్థాయిలో ఉన్నప్పుడు ఛందోరూపకల్పనలో సౌందర్యసిద్ధిని ఆపాదించాలి. అప్పుడు శ్రవణయోగ్యమైన హృదయస్పందన కారణమైన కవిత్వం ఆవిర్భవిస్తుంది’ అని దువ్వూరి అనేవారు. ఆయన ఆశించినట్లే పద్య నిర్మాణంలో మంచి సౌందర్యాన్ని సాధించారు కూడా.
ప్రాచీన కవులలో తిక్కన కవిత్వంలో ‘నాటకీయత’ ను పరిచయం చేసారు. అలాంటి ఉత్కృష్ట కవితా లక్షణాన్ని వ్యాస ప్రక్రియలో పొందుపరచిన రచయితగా వరద రాజేశ్వరరావుని పేర్కొనవచ్చు. ఎందుకంటే, అతని వ్యాస సంపుటాలు చదువుతుంటే మన కళ్ళ తెరముందు ఓ నాటకం ప్రదర్శించబడుతున్నట్టు ఉంటుంది. అదే వరద ప్రత్యేకత. అదే ఒక ఉదాత్తమైన రచయితగా తీర్చిదిద్దింది కూడా.

- Advertisement -

పిల్లా తిరుపతిరావు…7095184846

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News