Friday, May 10, 2024
Homeఫీచర్స్Arti Dogra IAS: ఆర్తి ..అడుగులకు అందని స్ఫూర్తి

Arti Dogra IAS: ఆర్తి ..అడుగులకు అందని స్ఫూర్తి

కాశీ విశ్వనాథ్ కారిడార్ చీఫ్ ఆర్కిటెక్ట్ గా మోడీ ఆర్తిని ప్రశంసించారు

ఆర్తి డ్రోగా.. ఆమె ఎత్తు మూడున్నర అడుగులే. కానీ ఆమె ఎదిగిన ఎత్తు మాత్రం అందరికీ అందనిదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎందరికో ఆమె నేడు స్ఫూర్తివంతమైన ఐఎఎస్ అధికారిణి అయ్యారు. ప్రజల ‘ఆర్తి’ ఎరిగిన ప్రభుత్వ అధికారిణిగా మన్ననలను అందుకుంటున్నారు.

- Advertisement -

ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు. ఆర్తి డోగ్రా..ఎందరో యువతీ యువకులలో స్ఫూర్తిని నింపుతున్న ఐఎఎస్ అధికారిణి. ఆమె మరుగుజ్జుతనం ఆమె లక్ష్యానికి ఆడ్డుకాలేదు. ఆమె కలలను చెదరనివ్వలేదు. తొలి ప్రయత్నంలోనే యుపిఎస్సిలో విజయం సాధించి ఐఎఎస్ అధికారిణిగా పదవీబాధ్యతలను చేపట్టారామె.
ఉత్తరాఖండ్ లోని డెహరాడూన్ కు చెందిన ఆర్తి కేవలం 3.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటారు. కానీ అది ఆమె ఐఎఎస్ కలను కరిగించ లేదు. పైగా ఆ కలను నిజం చేసుకుని సమున్నతంగా నిలిచారు. ప్రస్తుతం అజ్మీర్ కలక్టెర్ గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుంచీ ఆర్తి జీవితం అవమానాలతోనే సాగింది. ఆమె పొట్టితనాన్ని వేలెత్తి చూపుతూ ఎందరో గేలిచేశారు. సమాజం తమ బిడ్డను చిన్నచూపు చూసినా ఆర్తి తల్లదండ్రులు మాత్రం ఆమెను తమ గుండెల్లో పెట్టుకుని చూశారు. ఉన్నత చదువులు చెప్పించారు.

బ్రైట్ల్యాండ్ స్కూల్ లో ఆర్తి తన ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధి కిందకు వచ్చే లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో ఆర్తి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె డిగ్రీ చదువుకునే రోజుల్లో మనీషా పవన్ అనే మహిళా ఐఎఎస్ అధికారిని కలిశారు. ఆర్తి యుపిఎస్ సి వైపు అడుగులు వేయడానికి ఆమే స్ఫూర్తి అయ్యారు. యుపిఎస్సికి ఎంతో కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించారు. రాజస్తాన్ కేడర్ ఐఎఎస్ అధికారి అయ్యారు. ఐఎఎస్ అధికారిణిగా ఆర్తి ఎన్నో ప్రజా సంక్షేమ చర్యలను చేపట్టారు. ఉదాహరణకు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులకు వీల్ ఛైర్స్, వ్యాన్ల సౌకర్యం కల్పించారు. ఆర్తి చేబట్టిన ఈ చర్యల కారణంగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 17,000 మంది పైగా దివ్యాంగులు రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కును ఉపయోగించుకోగలిగారు. అలా ఆర్తి ఎందరో ప్రజల హ్రుదయాలలో స్థానం సంపాదించుకున్నారు.

చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మరెందరో నిర్భాగ్యులకు చిరుదీపంలా ఆర్తి నిలబడ్డారు. అలా వినూత్నమైన, విలక్షణ మైన కార్యక్రమాలను చేపట్టి ‘ప్రజల ఐఎఎస్ అధికారిణిగా’ పేరు తెచ్చుకున్నారు. వివక్ష, శారీరక లోపాలు ఏవీ పట్టుదల, నిబద్ధతలు ఉంటే ఎంత అసాధ్యమైన కలనైనా నిజం చేసుకోవచ్చని ఆర్తి నిరూపించారు. ఆర్తి డోగ్రా 2006 బ్యాచుకు చెందిన ఐఎఎస్ అధికారిణి. తనకెదురయిన ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఆర్తి ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏ ఒక్క క్షణమూ తనలోని పాజిటివ్ స్వభావాన్ని ఆమె వీడలేదు. అదే ఆమె విజయాలకు చిరునామాగా నిలిచింది అని ఆర్తీని ఎరిగిన వారు ఎంతో గర్వంగా చెపుతుంటారు. సమాజంలో మంచి మార్పు కోసం ఆమె చేపట్టిన పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విధానాలు ప్రజల ప్రశంసలను అందుకున్నాయి. ఆర్తి పుట్టినపుడు తల్లిదండ్రులకు ఆమె మరుగుజ్జు పరిస్థితిని వైద్యులు తెలిపి ఆర్తిని స్పెషల్ స్కూలుకు పంపమని సూచించారు. కానీ ఆర్తి తల్లిదండ్రులు కల్నల్ రాజేంద్ర డోగ్రా, కుంకుమ్ డోగ్రాలు సాధారణ స్కూలుకే ఆర్తిని పంపారు. నలుగురితో పాటు తమ బిడ్డ చదువుకునేలా ప్రోత్సహించారు. అందుకే ఆర్తి ప్రతి సందర్భంలోనూ తను ఈ స్థాయికి ఎదగడానికి తన తల్లిదండ్రులే కారణమని అంటారు.


ఐఎఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఆర్తి జోధ్ పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరక్టర్ గా , ఆ తర్వాత అజ్మీర్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. జోధ్ పూర్ కు చెందిన జోధ్ పూర్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ డిస్కమ్ (డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్) కు తొలి మహిళా ఎండి (అడ్మిమినిస్ట్రేటివ్ చీఫ్)గా ఆర్తి విధులను నిర్వహించడం మరో విశేషం. అంతేకాదు అజ్మీర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్ డి ఎం) గా కూడా ఆర్తి పనిచేశారు. బికనీర్ అండ్ బుండి డిఎంగా విధులు నిర్వహించారు. 2018లో రాజస్తాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ కు కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. బికనీర్ లో కమ్యూనిటీ ఆధ్వర్యంలో బేంకో బికనొ అనే పేరుతో పారిశుధ్య ప్రచార కార్యక్రమాన్ని ఆర్తి చేపట్టారు. నీరు, నేల పారిశుద్ధ్యం గురించిన అవగాహనను ప్రజల్లో పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఆర్తి చేపట్టారు. బహిరంగ మల విసర్జనను ఆపే దిశగా ఆర్తి దీనికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా 195 పంచాయతీలలో స్థానిక ప్రజలు వందల సంఖ్యలో టాయ్ లెట్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ పనిని ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండి సక్రమంగా జరిగేట్టు చూశారు.

అంతేకాదు దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పలు కార్యక్రమాలను కూడా ఆర్తి చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా దివ్యాంగ రథాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు పోలింగ్ బూతుల దగ్గర దివ్యాంగులకు సహాయపడేందుకుగాను బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా ఆర్తి నియమించారు. అందువల్లే 17,000 మందికి పైగా దివ్యాంగులైన ఓటర్లు రికార్డు స్థాయిలో పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలిగారు. బికనీర్ డిఎంగా ఉన్న సమయంలో డాక్టర్స్ ఫర్ డాటర్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తమ హాస్పిటల్స్ పరిధిలో ప్రతి డాక్టరు ఒక అనాధ బాలికను దత్తత తీసుకునేలా ఎందరో వైద్యులను ఆర్తి ప్రోత్సహించారు. తాము దత్తత తీసుకున్న పిల్లల కూడు, గుడ్డ, నీడ, విద్య బాధ్యతలన్నీ ఆ వైద్యులవే. అలా 40 మంది వైద్యులు 40 మంది ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. ఇప్పటికీ ఆ జిల్లాలో ఎందరో వైద్యులు ఆర్తి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించడం చూస్తే ఆర్తి చేపట్టిన ఈ కార్యక్రమం ఎందరు యువ వైద్యులకు స్ఫూర్తినిచ్చిందో అర్ధమవుతుంది. జోధ్ పూర్ డిస్కం ఎండీగా ఉన్నప్పుడు ఆర్తి 3,27,819 లెడ్స్ ను పంపిణీ చేశారు. తక్కువ వాటేజ్, ఖరీదుతో ఎనర్జీని పేదలకు సైతం అందుబాటులో తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఆర్తి దీన్ని చేపట్టారు. మిషన్ అగైస్ట్ అనేమియా కార్యక్రమాన్ని కూడా ఆర్తి చేపట్టారు.

డాటర్స్ ప్రెషస్ అవార్డు నుంచి మరెన్నో అవార్డులు ఆర్తి అందుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ నుంచి 2019లో జాతీయ అవార్డు అందుకున్నారు. అజ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గా ఆర్తి నిర్వహించిన ప్రశంసనీయమైన బాధ్యతలకు గాను ఆర్తికి ఈ గౌరవం దక్కింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజా సింధియా ఆర్తి అపూర్వమైన కార్యనిర్వహణాదక్షతకు ముగ్ధులయ్యారు. రాజస్థాన్ మరో ముఖ్యమంత్రి అశోక్ గెల్హాట్ ప్రశంసలను సైతం ఆర్తి అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్తి కార్యనిర్వహణా పటిమను ప్రశంసించారు. ఆర్తి మరుగుజ్జు అని అవహేళన చేసిన వారు, ఆమె భౌతిక రూపాన్ని వెక్కిరించిన వారే నేడు ఆమె ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన వైనం చూసి సిగ్గుతో తలదించుకుంటారనడంలో సందేహం లేదు. నేడు ఆమె ఎందరో ప్రజలకు ప్రియమైన ప్రభుత్వ అధికారిణిగా నిలవడమే కాదు ఉన్నత ప్రభుత్వోద్యోగాలను చేపట్టనున్న కొత్తతరం యువతీ యువకులకు సైతం మరింత గొప్ప స్ఫూర్తి అవతారనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News