కాన్సర్ ఉందని తెలిసిన వెంటనే మానసికంగా తీవ్ర షాక్ కు గురయ్యేవారు మనచుట్టూతా ఎందరో ఉన్నారు. కాన్సర్ చికిత్స కయ్యే ఖర్చు తలచుకుని భయపడిపోయే మధ్యతరగతి, సామాన్య ప్రజల గురించి ఇక చెప్పనవసరం లేదు. ఈ రోగంతో బతకడం అవసరమా అని తీవ్ర మానసిక నిస్ప్రుహకు,
క్రుంగుబాటుకు గురయ్యే కాన్సర్ పేషంట్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి అండగా నేనున్నానంటూ నిలబడుతున్నారు డాక్టర్ హిమానీ సింగ్. ఎంతో ఖర్చుతో కూడిన కాన్సర్ చికిత్సను తక్కువకే కాన్సర్ రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చే బ్రుహత్తరమైన పనికి డాక్టర్ హిమానీ పూనుకున్నారు. తన సేవల ద్వారా ఎందరో కాన్సర్ రోగుల జీవితాలలో సరికొత్త ఆశలను ఆమె చిగిరిస్తున్నారు. అదెలాగంటే…
హిమానీ సింగ్ వైద్యురాలు మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. కాన్సర్ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు డాక్టర్ హిమానీ ఎంతగానో క్రుషిచేస్తున్నారు. ప్రారంభదశలోనే కాన్సర్ ను గుర్తించి నాణ్యమైన వైద్య చికిత్స అందించేందుకు హిమానీ పూనుకున్నారు. అంతర్జాతీయంగా ఎంతోమంది రకరకాల కాన్సర్ల బారిన పడి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. కాన్సర్ పై చేస్తున్న పోరాటంలో వీళ్లు తమ జీవితంపైనే ఆశలు వదులుకుంటున్నారు. ఈ చికిత్సకు అవుతున్న ఖర్చు కూడా భారీగా
ఉండడంతో ముఖ్యంగా సామాన్యుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. ఈ క్రమంలోనే ఎందరో కాన్సర్ తో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే కాన్సర్ పై అవగాహనను, చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా, ప్రాధమిక దశలోనే దాన్ని గుర్తించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్ హిమానీ నిరూపిస్తున్నారు. ఆ దిశగా ఎందరో కాన్సర్ రోగులకు నూతన జీవితాన్ని ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక వైద్యురాలిగా కాన్సర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా కాన్సర్ ను ప్రాధమిక దశలోనే గుర్తించేందుకు పలు కాన్సర్ నిర్ధారిత సెంటర్లను దేశం యావత్తూ నెలకొల్పుతూ
తక్కువ ఖర్చులో కాన్సర్ చికిత్స సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు హిమానీ పాటుపడుతున్నారు. అంతేకాదు నిరుపేదలకు ఉచిత కాన్సర్ చికిత్సా సేవలు అందించే దిశగా కూడా ఆమె క్రుషిచేస్తున్నారు. కాన్సర్ ఎడ్యుకేషన్ తో పాటు రోగులకు అన్నిరకాలైన అండదండలు అందించేందుకు ‘గోల్డ్ యూనివర్స్ కాన్సర్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థను నెలకొల్పి దాని సిఇవొగా వ్యవహరిస్తున్నారు. దీనిపై మాట్లాడుతూ ‘ కాన్సర్ చాలా సంక్లిష్టమైన వ్యాధి. అంతేకాదు దీని చుట్టూ ప్రజలలో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయ‘టారామె. ఆమె ప్రధానంగా సాధారణ ప్రజలలో కాన్సర్ గురించిన స్ప్రుహ, అవగాహనలు పెంపొందించడంపై తన ద్రుష్టిని కేంద్రీకరించారు. కాన్సర్ గురించి ప్రజలు ఎంత బాగా తెలుసుకుంటే దాన్ని అంత సులభంగా జయించగలరంటారు డాక్టర్ హిమానీ. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో కాన్సర్ అవగాహనా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కూడా. అందులో భాగంగా సోషల్ మీడియాను కూడా హిమానీ విస్త్రుతంగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా కాన్సర్ గురించిన అవగాహన వేగంగా ప్రజలలోకి వెడుతుందని ఆమె అంటారు. అలా ఆమె పలు సోషల్ మీడియా వేదికల ద్వారా కాన్సర్ నిరోధంపై, రోగ లక్షణాల గురించి, కాన్సర్ వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయనే విషయాల గురించి విస్తారంగా చర్చిస్తున్నారు. తద్వారా ప్రజలకు కాన్సర్ పై పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తున్నారు. కాన్సర్ గురించి ప్రజలను చైతన్యపరచడం వల్ల వాటి లక్షణాలను ప్రాధమిక దశలోనే ప్రజలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటారని, అలా ఎందరో రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడతారని ఆమె అంటారు.
కాన్సర్ కు ప్రాధమిక దశలోనే చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు అది వ్యాపించదని, అలాగే దాని చికిత్సకి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని హిమానీ అంటారు. ‘ప్రాధమిక దశలోనే కాన్సర్ ను గుర్తించడం వల్ల దాని చికిత్స కూడా సులువవుతుంది. ఆ చికిత్స కూడా నూరు శాతం సత్ఫలితాలను ఇస్తుంది. అందుకే కాన్సర్ డిటెక్షన్ సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్నాం. ఈ
సెంటర్ల ద్వారా రొమ్ము కాన్సర్, సర్వైకల్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్ వంటి పలు రకాల కాన్సర్లకు స్ర్కీనింగ్ సేవలను రోగులకు ఉచితంగా అందిస్తాం’ అని హిమానీ తెలిపారు. ప్రజలందరికీ ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆమె విశేష క్రుషి చేస్తున్నారు. కాన్సర్ చికిత్సకు అయ్యే
ఖర్చులు భారీగా ఉంటాయి. ఈ ఖర్చులు పేషంట్లకు అందుబాటులో ఉండేలా క్రుషిచేస్తూ డాక్టర్ హిమానీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు, ఛారిటబుల్ సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటూ కాన్సర్ చికిత్స అవసరమైన ఎందరో రోగులకు తక్కువ ఖర్చుతో
నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు పేషంట్లకు ఉచితంగా కూడా వైద్య సేవలు అందించేందుకు ఆమె క్రుషిచేస్తున్నారు. తక్కువ ఖర్చులో కాన్సర్ రోగులకు చికిత్సను అందించే
ప్రయత్నంలో పలు ఆసుపత్రులతో, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో కలిసి సైతం హిమానీ పనిచేస్తున్నారు. ఆరోగ్యసేవలు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందంటారామె. కాన్సర్ పేషంట్లకు డాక్టర్ హిమానీ అందిస్తున్న సేవలకు ఎన్నో వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కాన్సర్ పై అవగాహన పెంచుతూ,
ఉచితంగా కాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, తక్కువ ఖర్చుతో చికిత్సను అందిస్తున్న హిమానీ సేవలు కాన్సర్ పేషంట్లలో జీవితం పట్ల కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. కాన్సర్ నియంత్రణలో, అలాగే తక్కువ ఖర్చుతో కాన్సర్ చికిత్స అందించే విషయంలో డాక్టర్ హిమానీ నిబద్దత ఎందరో వైద్యులకు స్ఫూర్తిదాయకం.