Monday, May 20, 2024
Homeఫీచర్స్Mummy tummy: డెలివరీ తరువాత నాజూకు పొట్ట..

Mummy tummy: డెలివరీ తరువాత నాజూకు పొట్ట..

ప్రసవం తర్వాత పొట్ట లేకుండా ఉండలంటే..

- Advertisement -

బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు పెద్ద పొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా వీళ్ల పొట్ట సాగకుండా నిరోధించే చిట్కాలు కొన్ని ఉన్నాయి. ప్రసవం అయి బిడ్డ పుట్టిన తర్వాత కొందరికి పొట్ట ఎత్తుగా ఉంటుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత తల్లులను రెండు సమస్యలు వేధిస్తాయి. ఒకటి శరీర బరువు, ఆరోగ్యం అయితే రెండవది పొట్ట ఎక్కువగా ఉండడం. ప్రసవం వల్ల చర్మం వదులుకావడం ఇందుకు ఒక కారణమైతే శరీరంలోని ముఖ్య కండరాలు బాగా సాగడం మరో ప్రధాన కారణం. పొట్ట చుట్టూ ఉన్న చర్మం సాగడంతో పాటుగా గర్భాశయం కూడా పెద్దదవుతుంది. దాంతోపాటు శరీరంలోని కొవ్వు పెరుగుతుంది. అలాగే శరీరంలో నీరు, రక్తం పరిమాణం ఎక్కువవుతాయి. శరీరంలోని ప్రధాన కండరాలు బాగా బలహీనపడతాయి.

ప్రసవం తర్వాత పెరిగిన పొట్టను తగ్గించుకునేందుకు కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి. పొట్ట తగ్గేలా చేయడంలో శరీరం సైతం ఎంతో సహకరిస్తుంది. పొట్టచుట్టూ సాగినట్టు ఉన్నచర్మాన్ని బిగుతుగా చేయొచ్చు. సహజ ప్రసవం కాకుండా సి సెక్షన్ ద్వారా బేబీని కన్నప్పుడు ఆ పొట్టను తగ్గించడం భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పొట్ట తగ్గడానికి, ఆ ప్రదేశంలోని చర్మం బిగుతుగా అవడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. మొత్తానికి ప్రసవానంతరం పొట్టదగ్గర జారిన చర్మాన్ని తగ్గిచ్చుకోవాలంటే 21 రోజుల పోస్టపార్టమ్ ఛాలెంజ్ ఉంటుంది. ఇందుకు వర్కవుట్ల ప్లాన్ విడిగా ఉంటుంది. అలాగే ఆహార నియమాలు కూడా వేరేగా ఉంటాయి.

స్ట్రెంగ్త్ బేస్డ్ వర్కవుట్లు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయగలుగుతారు. అలాగే పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ కూడా పాటించాలి. అలాగే సి సెక్షన్ తల్లులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు ఉంటాయి. పొట్ట ప్రాంతంలో రోజూ లోషన్ రాయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని చర్మం మ్రదువుగా తయారవుతుంది. అంతేకాదు దాని ఎలాస్టిసిటీ మెరుగుపడుతుంది. ఇలా చేయడం వల్ల మరిన్ని స్ట్రెచ్ మార్కులు పడకుండా నిరోధించవచ్చు. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అయితే పొట్టపై బ్యాండేజీలు, కుట్లు పోయేవరకూ తల్లులు ఈ పని చేయకుండా ఓర్పు వహించాలి. ఆతర్వాతే పొట్ట దగ్గర వదులైన చర్మంపై నిత్యం లోషన్ రాసి సున్నితంగా మసాజ్ చేయడం మొదలెట్టాలి.

తేలికపాటి లోషన్ లేదా స్ట్రెచ్ మార్కు ఆయిల్ ఇందుకు ఉపయోగిస్తే మంచిది. సి సెక్షన్ తర్వాత నడుముకు పట్టీలాంటిది పెట్టుకోవడం చాలా అవసరం. దానివల్ల బ్యాక్ పెయిన్ బారిన పడకుండా రక్షించబడతారు. ఆ ప్రదేశంలో ఏదో జారిపోతున్న ఫీలింగ్ యంగ్ మదర్స్ కు ఉండదు. అంతేకాదు నడుం చుట్టూ ఈ పట్టీ పెట్టుకోవడం వల్ల పొట్టదగ్గర కండరాలకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆతర్వాత మసాజ్ చేయడం ప్రారంభించాలి. పొట్ట ప్రదేశంలో లోషన్ రాసుకునేటపుడు చేసుకునే మసాజ్ కన్నా ఈ దశలో చేసుకునే మసాజ్ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చేసే మసాజ్ వ్యూహాత్మకంగా, కొంత ఒత్తిడి ప్రయోగిస్తూ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసేటప్పుడు ఆ ప్రదేశంలో నొప్పిగా అనిపిస్తే ఆపేయాలి. నొప్పి ఫీలవుతున్నారంటే ఒత్తిడిపెట్టి మసాజ్ చేసుకునే సమయం మీకు ఇంకా రాలేదని గ్రహించాలి. అందులోనూ మీది సి సెక్షన్ డెలివరీ అయితే, స్ట్రెచ్ మార్కలు ఇంకా మిమ్మల్ని బాధిస్తుంటే మీరు మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది. అది అంతా ఓకే అయితే మీ పొట్టపై వృత్తాకారంలో మెల్లగా బొటనవేలిని ఉపయోగించి మసాజ్ చేయాలి.

ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. పొట్టమీదే కాకుండా బొడ్డు కింద, అండర్ వేర్ ధరించే ప్రదేశం వరకూ మసాజ్ చేయాలి. అలాగే కొత్త తల్లులు ఎంత నడిస్తే అంత మంచిది. నడక వారి కండరాలకు ఎంతో శక్తిని ఇస్తుంది. నెలలు నిండిన సమయంలో చాలామంది గర్భవతులు నడవడానికి కష్టపడతారు. దీంతో నడక ఆపేస్తుంటారు. ఫలితంగా శరీరంలోని కండరాలు బలహీనపడే అవకాశం ఉంది. అందుకే గర్భవతులుగా ఉన్నప్పుడు నిత్యం కనీసం ఐదు నిమిషాలైనా నడవాలి. ఈ అలవాటు ప్రసవానంతరం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రసవానంతరం వ్యాయామాలు చేయడం మొదలెట్టినపుడు వీళ్లు ఎక్కువ ఇబ్బందికి గురికారు. పెల్విక్ కండరాలు కూడా పటిష్టంగా ఉండాలి. ఇందుకు కెగెల్స్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పెల్విక్ కండరాలు సరిగా లేకపోతే మూత్ర సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. పెల్విక్ కండరాలు బలంగా ఉంటే వాటికి అనుసంధానంగా ఉండే టిష్యూలు కూడా బలంగా ఉంటాయి. అందుకే కెగెల్ వ్యాయామాలు చేయడం అత్యావశ్యకం. డయాబెటిస్ సమస్య   ఉన్నా కూడా పొట్ట చుట్టూ ఉన్న చర్మం సాగడం జరుగుతుంది. క్రంచెస్, ప్లాంక్స్ ఈ విషయంలో ఏమీ సహకరించవు. వాటిని చేయడం వల్ల పరిస్థితి మరింత దారుణం అవుతుంది తప్ప ఫలితం ఉండదు. అందుకే ప్రసవానంతరం సాధారణ పొట్ట లేదా ఫ్లాట్ పొట్ట కావాలంటే కండరాల టోనింగ్ ఎంతో అవసరం. దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, సూచనలు, పర్యవేక్షణ అత్యావశ్యకం.

పొట్టను తగ్గించుకోవడంలో కొన్ని కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. క్యాట్ కౌ వ్యాయామంతో వ్యాయామాలు ప్రారంభిస్తే మంచిదంటారు ఫిట్ నెస్ నిపుణులు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా న్యూమదర్స్ తప్పనిసరిగా చేయాలి. పాలఉత్పత్తి వల్ల శరీరంలోని కాలరీలు కరుగుతాయి. దాంతో శరీరంలోని కొవ్వు మెల్లగా పోతుంది. అలా యంగ్ మదర్స్ పొట్ట ఆరోగ్యంగా, సన్నగా, ఫ్లాట్ గా తయారవుతుంది. అయితే పాలు ఇచ్చే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా ఎన్నో పోషకాలను కోల్పోతారు. అందుకే వారు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అదే సమయంలో అదనపు కాలరీలు కూడా ఈ తల్లులకు అవసరమవుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల గర్భాశయ ద్వారం బలపడుతుంది. పొట్ట ఫ్లాట్ అవాలన్నా, లోపలికి పోవాలన్నా ఇది చాలా అవసరం. అంతేకాదు దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.

న్యూమదర్స్ నీటిని బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల వారి శరీరంలోని అనవసరమైన ఫ్లూయిడ్లు బయటకు పోతాయి. అదే సమయంలో నీరు బాగా తాగుతుండడం వల్ల తాజా ఫ్లూయిడ్లు శరీరానికి అందుతుంటాయి. అలాగే నీళ్లు బాగా తాగడం వల్ల శరీరానికి బాగా హైడ్రేషన్ అందుతుంది. అంతేకాదు బ్రెస్టు ఫీడింగ్ ఇచ్చేవాళ్లు నీటిని బాగా తాగడం చాలా అవసరం. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై బ్రషింగ్ కూడా యంగ్ మదర్స్ కు ఎంతో ముఖ్యం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేట్టు చేస్తుంది. రక్తప్రసరణ బాగా జరుగుతోందంటే చర్మం ఎలాస్టిసిటీ బాగుంటుందన్నమాట. అంతేకాదు చర్మం కూడా ఎంతో మ్రుదువుగా, సున్నితంగా తయారవుతుంది. పొట్ట నాజూగ్గా అవుతుంది. ఇవి పాటించేటప్పుడు వైద్యుల పర్యవేక్షణ అవసరం. కాబట్టి వైద్యులను తప్పకుండా సంప్రదించడం మరవొద్దు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News