Tuesday, January 28, 2025
Homeఫీచర్స్Rezwana Choudhury Bannya: రవీంద్ర కోకిల రజ్వానా

Rezwana Choudhury Bannya: రవీంద్ర కోకిల రజ్వానా

గ్లోబులో రజ్వానా తిరగని దేశం లేదు

రవీంద్ర సంగీతం ఆమె గొంతులోంచి జారువారుతుంటే ముగ్ధులమైపోతాము. రవీంద్ర సంగీతమనగానే అందరి మనసుల్లో మొదటగా మెదిలేది కూడా ఆమే. విశ్వకవి రవీంద్రుడు రచించి కూర్చిన సంగీతంపై అద్భుతమైన పట్టు ఆమె సొంతం. అందుకే ఆమెకు వచ్చిన అవార్డుల పంట కూడా ఎక్కువే. తాజాగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పౌర అవార్డు పద్మభూషణ్ ను ఆమెకు ప్రకటించింది. అది కూడా ఆమె
అసంఖ్యాకమైన అవార్డుల హారంలోకి వచ్చిచేరింది. ఆమే రజ్వానా చౌధురి బన్యా. ఈ సందర్భంగా రజ్వానా గురించి కొన్ని విశేషాలు..

- Advertisement -

రజ్వానా బంగ్లాదేశ్ రంగపూర్ జిల్లాలో 1957, జనవరి 13న జన్మించారు. ప్రారంభంలో ఆమె ఛాయానాథ్ లో విద్యనభ్యసించారు. ఆ తర్వాత విశ్వభారతి యూనివర్సిటీలో ఆమె చదువు కొనసాగింది. ఆమె తల్లిదండ్రులు మజారుద్దీన్ ఖాన్, ఇస్మత్ ఆరాఖాన్లు. చిన్నతనంలో సంగీతాన్ని ఆమె తన అంకుల్ అబ్దుల్ ఆలి దగ్గర నేర్చుకున్నారు. ఆ తర్వాత డాకాలోని ఛాయానాథ్, బుల్బుల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో సంజీదా ఖాతూన్, అతికుల్ ఇస్లామ్ ల దగ్గర గాత్ర విద్యను కొనసాగించారు. సంగీతంతో పాటు రజ్వానా ఢాకా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రోగ్రామ్స్ లో కూడా చేశారు. కానీ ఆమె మనసు మాత్రం సంగీతం మీదే ఉండేది. సంగీతమే తన జీవితమని, ఆత్మ అని రజ్వానా గ్రహించారు.

అప్పుడే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వారి స్కాలర్షిప్ రజ్వానాకు రావడంతో మనదేశంలోని శాంతినికేతన్ లో అడుగుపెట్టారు. శాంతినికేతన్ ను స్థాపించింది రవీంద్రనాథ్ టాగోర్. అక్కడ ప్రముఖ సంగీత నిపుణులైన కనిక బంధోపాధ్యాయ,నీలిమా సేన్,శైలజారంజన్ మజుందార్, శాంతిదేవి ఘోష్, మంజు బంధోపధ్యాయ, గోరా సర్బాధికారి,ఆశిష్ బంధోపధ్యాయల దగ్గర రజ్వానా సంగీతం నేర్చుకున్నారు.
విశ్వభారతి నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. కొంతకాలం కనికా బెనర్జీ (మొహర్ ది)దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు కూడా. 2021లో డాకా యూనివర్సిటీలో రవీంద్ర సంగీతం మీద అధ్యయనం చేశారు. అప్పుడే ఆమె డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను అందుకున్నారు. ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ లో ప్రొఫెసర్, ఫౌండింగ్ ఛెయిర్ గా రజ్వానా వ్యవహరిస్తున్నారు. కనికా బంధోపధ్యాయా అందించిన స్ఫూర్తితో రజ్వానా 1992లో షురర్ ధారా అనే ప్రతిష్ఠాత్మకమైన సంగీత పాఠశాలను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా రవీంద్ర సంగీతం మీద ఆమె ఎక్కువగా ద్రుష్టిపెట్టారు.

2010లో రవీందనాథ్ టాగోర్ 150వ జన్మదినం పురస్కరించుకుని రవీంద గీతాలపై ఒక ఆడియో వర్షన్ ను కూడా తీసుకువచ్చారు. అందులో టాగోర్ గీతోబితాన్ లోని 2,233 పాటలను రికార్డు చేశారు. దానికి శ్రుతి గీతోబితాన్ అని పేరు పెట్టారు. రజ్వానా రవీంద్ర సంగీతానికి ఎంతో వన్నె తెచ్చిన విషయం తెలిసిందే. దానితో పాటు శాస్త్రీయ సంగీతానికి సైతం ఆమె ప్రపంచ ప్రతిష్టను తెచ్చారు. ఆమె గొంతులో మాధుర్యం ఎంత బాగా ఉంటుందో, మధురమైన భక్తి కూడా అంతే బాగా జాలువారుతుంది. అలా తన గాన మాధుర్యంతో బంగ్లాదేశ్ లోనే కాదు అంతర్జాతీయంగా పలు దేశాలలో విలక్షణ కళాకారిణిగా, గాయకురాలిగా రజ్వానా పేరు తెచ్చుకున్నారు. రజ్వానాకు బాల్యం నుంచీ సంగీతమంటే పంచప్రాణాలు. ముఖ్యంగా రవీంద్ర సంగీతమంటే రజ్వానాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టం కాస్తా శాంతినికేతన్ లోకి అడుగుపెట్టిన తర్వాత అదే ప్రపంచంగా మారింది. గ్లోబులో రజ్వానా తిరగని దేశం లేదు.

ప్రపంచంలోని అన్ని దేశాలలో రవీంద్ర సంగీతాన్ని విస్త్రుతంగా వ్యాప్తిచేసిన క్రెడిట్ రజ్వానీదే అంటే అతిశయోక్తి కాదు. రవీంద్ర సంగీతంపై ఆమె విడుదల చేసిన ఆడియా కేసెట్లు, సిడీలకు లెక్కేలేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినా రవీంద్ర సంగీతంలో ప్రావిణ్యురాలు, ప్రముఖురాలుగా పేరుతెచ్చుకున్న రజ్వానా కోనికా బంధోపాధ్యాయ దగ్గరే రవీంద్ర సంగీతంలో శిక్షణ పొందారు. రజ్వానా రవీంద్ర సంగీతం వినడానికి దేశవిదేశాల్లోని ఎందరో శ్రోతలు చెవికోసుకుంటారు. అలా తన గురువు కనికా బంధోపాధ్యాయకు తగిన శిష్యురాలని పించుకున్నారు. రజ్వానా తన బ్రుందంలోని ప్రతి ఒక్క సభ్యునికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఆమెలో కనిపించే మరో విలక్షణమైన లక్షణం. రజ్వానా స్థాపించిన శురుర్ ధారా సంగీత కళాశాల నుంచి పట్టభద్రులైన ఎందరో ఆమె అందించిన సంగీత సంపదను సర్వత్రా వ్యాప్తిచేస్తూ ఆమెకు ఎంతో కీర్తిప్రతిష్టలు తెస్తున్నారు. ఆమె విద్యార్థులలో బంగ్లాదేశ్ వాసులే కాకుండా ఎందరో భారతీయులు కూడా ఉన్నారు. సాధారణమైన వారిని సైతం అక్కున చేర్చుకుని వారికి సంగీతం నేర్పి తన బ్రుందంలో చేర్చుకుంటారామె.

అరవై ఐదేళ్ల ఈ రవీంద్ర కోకిలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ను ఇవ్వడం ఆమె రవీంద్ర సంగీతానికి చేసిన గొప్ప క్రుషికి నిదర్శనం. రవీంద్ర సంగీతంలో ఉత్తమ మహిళా గాయనిగా ఆనంద్ సంగీత్ పురస్కార్ కూడా రజ్వానాకు వచ్చింది. భారత సాంస్క్రుతిక శాఖ 2013లో రజ్వానాకు సంగీత సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది కూడా. రవీంద్ర సంగీతానని గ్లోబంతటా వ్యాప్తి చేసే లక్ష్యంతో 35 ఏళ్లుగా రజ్వానా అవిరళ క్రుషి చేశారు. రవీంద్ర సంగీతంలోని అపూర్వమైన, సున్నితమైన, సౌందర్యవంతమైన, భక్తి, ప్రేమలు జాలువారే మధురమైన సందేశాలను తన తీయని గాత్రం ద్వారా విశ్వ జనావళి హ్రుదయాలలో నాటారు. అంతేకాదు రవీంద్ర సంగీతంపై ఆమె ఇచ్చిన ప్రసంగాలకు కొదవే లేదు. చిన్నతనంలోనే రవీంద్ర టాగోర్ అంటే ఎంతో సమ్మోహితరాలైన తనకు శాంతినికేతన్ లో కాలుపెట్టడమనేది గొప్ప కల అని రజ్వానా అంటారు.

రజ్వానా ఏడెనిమిది తరగతులు చదివేటప్పుడే రవీంద్ర సంగీత సాధన చేసేవారట. అంతేకాదు శాంతినికేతన్ లో కనికా బంధోపాధ్యాయ తన టీచరైనా ఆతర్వాతి రోజుల్లో అంటే ఆమె చనిపోయేదాకా తమ మధ్య చిగురించిన బంధం ఎంతో గొప్పదని అంటారు రజ్వానా. సంగీత పరంగానే కాదు తన ఆలోచనా ధోరణిపై కూడా కనికా బంధోపాధ్యాయ ప్రభావం ఎంతో ఉందని పలుసందర్భాలలో రజ్వానా అన్నారు కూడా. అంతేకాదు టాగోర్ జీవితాన్ని ఎలా చూడాలో కూడా తన గురువు, ఆత్మీయురాలు కనికా బంధోపాధ్యాయ తనకు తెలియజేశారంటారామె. ‘మా అమ్మతో నేను తనకు కూతురులాంటిదానినని కనికా బంధోపాధ్యాయ తరచూ అనేవారు. నా సంగీతాన్ని ఎంతో సూక్ష్మంగా పరిశీలించేవారు. తప్పు చేస్తే మందలించేవారు. అంతేకాదు సంగీతంలో నేను చేసిన తప్పులను సరిదిద్దేవారు. ఎలాంటి పాటలు నేను పాడాలో కూడా చెప్పేవారు. అంతేకాదు ఎలాంటి సంగీత కచేరీలకు వెళ్లాలో సూచించేవారు. ఇవన్నీ ఆమెకు నాపై ఉన్న ఆత్మీయతను, ప్రేమను, శ్రద్ధను ప్రతిఫలించేవి. అవే మా బంధంలో దాగున్న అమ్రుతం’ అని తన గురువు, సర్వం అయిన కనికా బంధోపాధ్యాయను రజ్వానా గుర్తుచేసుకున్నారు.

తన దేశంలోనే కాదు పలు ప్రాంతాలలో నేడు సంగీత పరంగా చాలామంది అనుసరిస్తున్న షార్ట్ కర్ట్స్ ఆందోళనకరమైనవని రజ్వానా పలుమార్లు నిరాశాను వ్యక్తంచేశారు కూడా. సంగీతాన్ని సాధనతో , మమేకంతో, పర్ఫెక్ట్ నెస్ తో పాడాలనే తపన రాను రాను కనుమరుగవడం బాధను కలిగిస్తోందని రజ్వానా అంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News