Flax Seeds Vs Health: ఏం తిన్నా…గ్యాస్,తేన్పులతో విపరీతంగా బాధపడుతున్నారా? ఓ రెండు రోజులు ఆయిల్ ఫుడ్ తిన్నామంటే మళ్లీ ఆకలే లేకుండా పోతుందా. ఇవన్నీ జీర్ణ సంబంధిత సమస్యలే. ఇప్పుడు బయట తినే అలవాటు, టైమ్‌కి తినకపోవడం వంటివి జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తున్నాయి. మెడిసిన్ వేసుకుంటే సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది కానీ, దీర్ఘకాలికంగా చూస్తే డైట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
మన రోజువారీ ఆహారంలో చిన్న మార్పులతోనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా అవిసె గింజలు (Flax Seeds) ఈ సందర్భంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి అజీర్తి, హార్మోనల్ సమస్యలు, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయని వైద్యులు వివరిస్తున్నారు.
మలబద్ధకం సమస్య…
చాలా మందికి ఏం చేసినప్పటికీ తొందరగా తేన్పులు తగ్గవు, మలబద్ధకం సమస్య ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయేందుకు దారితీస్తుంది. దీని ఫలితంగా మూడ్ మారిపోతుంది, నిద్ర సరిగా ఉండదు, అలసట ఎక్కువవుతుంది. దీన్ని తగ్గించడానికి కడుపు శుభ్రంగా ఉండడం ముఖ్యం. అందుకు సహాయపడే ఒక సాధారణ మార్గం అవిసె గింజలు.
అవిసె గింజల్లో ఉండే ప్రీబయాటిక్స్, ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం. ఇవి జీర్ణత శక్తిని మెరుగుపరచడంతో పాటు, మలాన్ని సాఫీగా బయటకు పంపించడంలో సహాయపడతాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్ ను చురుగ్గా ఉంచుతాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకోవడం ద్వారా మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు.
జీర్ణ వ్యవస్థలో మార్పు…
వాటి వినియోగం చాలా సులభం. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. లేదా సలాడ్, స్మూతీ లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. గోరువెచ్చటి పాలలో కలిపితే మరింత ఉపయోగం ఉంటుంది. కొన్ని రోజుల్లోనే జీర్ణ వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది.మహిళల్లో తరచూ ఎదురయ్యే హార్మోనల్ ఇబ్బందులు – నెలసరి సమయంలో అధిక నొప్పులు, ఒత్తిడితో కూడిన సమస్యలు – ఇవన్నీ అవిసె గింజల వల్ల నియంత్రణలోకి రాగలవని నిపుణులు అంటున్నారు. అవిసె గింజల్లో ఉండే లిగ్నాన్స్, ఫైటోఈస్ట్రోజన్లు హార్మోన్ బ్యాలెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు తీసుకునే సరైన సమయం ఉదయాన్నే పరగడుపున ఇలా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు సక్రమంగా అందుతాయి. పాలలో కలిపినా, నీటిలో కలిపినా – ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అయితే రోజూ ఒక టేబుల్ స్పూన్‌ను మించి తీసుకోకపోవడమే మంచిది.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/how-to-reduce-migraine-attacks-due-to-climate-change/
గుండె సంబంధిత సమస్యలు..
ఇప్పుడు మనలో చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్, బీపీ, స్ట్రెస్ వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇవి తగ్గించేందుకు వ్యాయామం మానవద్దు. కానీ ఆహారంలో చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు పొందొచ్చు. అవిసె గింజలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు కావాల్సిన సహాయం అందిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఆమ్లత తగ్గించడంలో, స్ట్రెస్‌ను నియంత్రించడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి.
పొడిలా చేసి అన్నంలో…
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. తద్వారా మనస్తత్వంలో సానుకూలత వస్తుంది. రోజూ తినే అలవాటుతోనే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.అవిసె గింజలు రుచి పరంగా కొద్దిగా విభిన్నంగా ఉండవచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే వాటిని తక్కువ వేడి మీద వేయించి తీసుకుంటే రుచి బాగుంటుంది. పొడిలా చేసి అన్నంలో కలిపి తినచ్చు. లేకపోతే జ్యూస్, స్మూతీల్లో కలిపితే కూడా మంచి రుచి వస్తుంది.
అవిసె గింజలు వాడేముందు వాటిని నానబెట్టడం అవసరం. ఇది అవి త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. పరగడుపున తీసుకుంటే ఫలితాలు బాగా కనిపిస్తాయి. కానీ మోతాదు విషయంలో జాగ్రత్త అవసరం. ఒక టేబుల్ స్పూన్ మించి తీసుకుంటే కొన్ని సందర్భాల్లో అజీర్తి తలెత్తే ప్రమాదం ఉంటుంది.


