Tuesday, September 17, 2024
Homeహెల్త్Winter drinks: చలికాలంలో ఇవి తాగండి

Winter drinks: చలికాలంలో ఇవి తాగండి

చాలామందికి చలికాలంలో వేడి వేడిగా టీ లేదా కాఫీలను తరచూ తాగలనిపిస్తుంది. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాఫీ తరచూ తాగడం వల్ల శరీరంలో జోష్ నిండినట్టనిపిస్తుంది. కానీ అందులోని కెఫైన్ కి మనం అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. పైగా కాఫీ ఎక్కువసార్లు తాగడం వల్ల యాంగ్జయిటీ, నిద్రలేమి, డీహైడ్రేషన్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. అందుకే వింటర్ లో టీ, కాఫీలకు బదులు ఆరోగ్యకరమైన వేడి వేడి డ్రింక్స్ ఏవి తీసుకోవచ్చో చూద్దాం…

- Advertisement -

 హాట్ కాఫీ, హాట్ చాక్లెట్ కు బదులు వేడి పాలల్లో పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేదా ఇలాచీ వేసిన వేడి బాదం పాలు తాగినా మంచిదే. పసుపుగాని, ఇలాచీ గానీ మంచి యాంటాక్సిడెంట్లు. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తాయి. బాదంలో విటమిన్ ఇ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్, గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫ్యాట్లు ఉంటాయి. సాయంత్రాలు కాఫీ , టీలకు బదులు ఆర్టిఫీషియల్ పదార్థాలు వేయకుండా ఇంట్లోనే తయారుచేసిన వేడి సూప్ తాగితే ఎంతో మంచిది. సూపులో పోషకాలు బాగా ఉంటాయి.

 చాయ్ ప్రేమికులు చలికాలంలో హెర్బల్ టీలు తాగితే మంచిది. దాల్చిన చెక్క, తులసి, లవంగం, ఏలకులు, అల్లం వంటి వాటితో టీ చేసుకుని తాగితే రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికీ కూడా ఇవి ఎంతో మంచివి. వైట్ షుగర్ కు బదులు టీలో ఆర్గానిక్ బెల్లం, తేనె, కోకోనట్ షుగర్ లేదా స్టెవియాలను వాడాలి. మార్కెట్ లో ఛమొమైల్, జాస్మిన్, లేవండర్, లెమన్ గ్రాస్, గ్రీన్ , స్ట్రాబెర్రీ లాంటి వెరైటీ టీలు దొరుకుతాయి. వాటినైనా తాగొచ్చు. ఇవి శరీరం, మెదడులను ఉల్లాసంగా ఉంచడమే కాదు వీటిల్లోని యాంటాక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి.

 కాఫీ ప్రేమికులైతే డికాఫినేటెడ్ కాఫీ తీసుకుంటే మంచిది. అలా తాగితే కెఫైన్ కు అలవాటు పడరు. కెఫైన్ కావాలనుకునేవారు మాత్రం రోజుకు రెండు చిన్నకప్పులకు మించి కాఫీ తాగకూడదు.

 కాఫీ, పాలతో చేసిన టీలకు బదులు అల్లం-తేనె- నిమ్మరసం కలిపిన వేడి టీ తాగితే శరీరానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేయడమే కాకుండా జలుబు, దగ్గుల బారిన పడకుండా కాపాడుతుంది. చలికాలంలో అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఈ సీజన్ లో ఎంతోమందిని బాధించే ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి.

 ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే బదులు గ్లాసుడు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఆ నీళ్లు గొంతులో వెచ్చగా దిగుతూ శరీరానికి మంచి ఎనర్జీనిస్తాయి. జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తాయి. ఈ నీళ్ల ద్వారా శరీరానికి నిత్యం విటమిన్ సి అందుతుంది. శరీరంలోని మలినాలు సైతం బయటకుపోతాయి.

 ఉదయం లేవగానే కాఫీ, టీలు తాగకుండా ఒక యాపిల్ తింటే ఆ రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News