Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Iran Crypto Trade: ఆంక్షల ఉచ్చుకు క్రిప్టోతో చెక్.. బ్రిక్స్​తో వాణిజ్యానికి ఇరాన్ సై!

Iran Crypto Trade: ఆంక్షల ఉచ్చుకు క్రిప్టోతో చెక్.. బ్రిక్స్​తో వాణిజ్యానికి ఇరాన్ సై!

Iran bypasses sanctions with cryptocurrency:  అంతర్జాతీయ ఆంక్షల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్, వాటిని అధిగమించేందుకు సరికొత్త, సంచలనాత్మక మార్గాన్ని అన్వేషిస్తోంది. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా, డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా భారత్ సహా బ్రిక్స్ దేశాలతో ఈ నూతన విధానంలో వాణిజ్యం సాగించాలని పావులు కదుపుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న ఈ ప్రయత్నం వెనుక ఉన్న వ్యూహమేంటి? అసలు ఇరాన్‌పై మళ్లీ ఎందుకు ఆంక్షల మేఘాలు కమ్ముకున్నాయి?

- Advertisement -

క్రిప్టోతో చెల్లింపులు.. ఆంక్షలకు చెల్లుచీటీ : అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల కారణంగా, ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యం జరపడం కష్టతరంగా మారింది. డాలర్లలో లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ గండాన్ని గట్టెక్కేందుకు, ఇరాన్ ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను ఒక ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తల ప్రకారం, దిగుమతులకు, ఎగుమతులకు సంబంధించిన చెల్లింపులను బిట్‌కాయిన్, ఈథీరియం వంటి క్రిప్టోల ద్వారా నిర్వహించాలని యోచిస్తున్నారు. దీనివల్ల పాశ్చాత్య దేశాల నియంత్రణలో ఉన్న బ్యాంకింగ్ మార్గాలను పూర్తిగా తప్పించుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది.

బ్రిక్స్ దేశాలే లక్ష్యంగా : ఈ క్రిప్టో వాణిజ్య ప్రణాళికలో ఇరాన్ ప్రధానంగా బ్రిక్స్ దేశాలపై (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దృష్టి సారించింది. ఈ దేశాలతో తమ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, క్రిప్టో చెల్లింపుల విధానానికి వారిని ఒప్పించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా, రష్యాలతో ఇరాన్‌కు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ దేశాలు పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ఇరాన్‌కు కలిసివచ్చే అంశం.

తిరగబెట్టిన ఆంక్షలు.. ఎందుకంటే : ఇరాన్ అణు కార్యక్రమంపై అనుమానాలతో గతంలో విధించిన ఆంక్షలను కొంతకాలం పాటు సడలించారు. అయితే, ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అధికారుల తనిఖీలకు ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపిస్తూ ఫ్రాన్స్, యూకే, జర్మనీ దేశాలు ఈ ఏడాది ఆగస్టులో ‘స్నాప్‌బ్యాక్ మెకానిజం’ను ప్రయోగించాయి. దీంతో అంతర్జాతీయ ఆంక్షలు మళ్లీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త ఆంక్షల వలయం నుంచే బయటపడేందుకు ఇరాన్ ఇప్పుడు క్రిప్టో మార్గాన్ని ఎంచుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad