Alzheimer Vs Lithium: ప్రపంచవ్యాప్తంగా వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేసే అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధిపై దశాబ్ద కాలం పాటు నడిచిన పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తించారు. మెదడులో సహజంగా ఉండే లిథియం అనే సూక్ష్మ లోహం స్థాయులు తగ్గిపోవడం ఈ వ్యాధి ఆరంభానికి సంబంధం ఉండవచ్చని తెలుస్తోంది.
లిథియం స్థాయులలోనే..
పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతులు, మతిమరుపు ప్రారంభ దశలో ఉన్నవారు, అలాగే అల్జీమర్స్ ముదిరిన వ్యక్తుల మెదడు, రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. మొత్తం ముప్పై రకాల లోహాల స్థాయులను పోల్చి చూశారు. ఆధునిక మాస్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతను ఉపయోగించి చేసిన ఈ పరీక్షల్లో కేవలం లిథియం స్థాయులలోనే స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి.
అల్జీమర్స్ రోగుల్లో..
లిథియం మెదడులోని నాడీ కణాల సాధారణ పనితీరును కాపాడటంలో, వాటిని దెబ్బతినకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. పరిశోధకులు గమనించిన మరో ముఖ్య అంశం ఏమిటంటే, అల్జీమర్స్ రోగుల్లో కనిపించే అమైలాయిడ్ ప్లాక్స్ అనే ప్రోటీన్ గడ్డలతో లిథియం బంధం ఏర్పడి, మెదడులో లిథియం స్థాయులు తగ్గిపోవడం. ఈ ప్రభావం రోగి జ్ఞాపకశక్తి , మానసిక పనితీరుపై ప్రతికూలంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో…
ఏది ఏమైనప్పటికీ లిథియం ఒరొటేట్ అనే కొత్త ఫారమైన సమ్మేళనం ఈ ప్లాక్స్‌కు చిక్కకుండా మెదడులో పనిచేస్తుందని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. అది మరోవైపు, ఆ పరిమాణానికి వృద్ధుల మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే లిథియం మోతాదులో వెయ్యోవంతు మాత్రమే కావడం వల్ల ఈ సమ్మేళనం వృద్ధులకు సురక్షితమన్న వాస్తవం తెలిసింది.
పరిశోధన బృందం సీనియర్ శాస్త్రవేత్త బ్రూస్ యాంక్నర్ ఈ విషయాన్ని మరింత వివరిస్తూ, మనం ఐరన్ లేదా విటమిన్ సీ వంటి పోషకాలు ఎలా అవసరమో, అలాగే లిథియం కూడా శరీరానికి కీలకమని పేర్కొన్నారు. లిథియం లోపం అల్జీమర్స్‌కు కారణం కావచ్చనే ఆలోచన కొత్తదని, ఇది భవిష్యత్తులో కొత్త చికిత్సా మార్గాలకు దారి తీస్తుందని ఆయన చెప్పారు.
ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా, రక్త పరీక్షల ద్వారా లిథియం స్థాయులను కొలిచి అల్జీమర్స్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ పరిశోధన ప్రధానంగా ఎలుకలపై మాత్రమే జరగడంతో, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ఫలితాలను నిర్ధారించాల్సి ఉందని వారు తెలిపారు.
ఇప్పటికే లభించిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం ద్వారా అందిన సమాచారం వైద్య శాస్త్రానికి కొత్త మార్గదర్శకంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రపంచ ప్రఖ్యాత నేచర్ జర్నల్‌లో ప్రచురించబడటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఆసక్తిని రేకెత్తించింది.
Also Read: https://teluguprabha.net/health-fitness/laptops-and-mobiles-may-reduce-male-fertility-experts-warn/
అల్జీమర్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధుల జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, రోజువారీ పనులు నిర్వహించడంలో ఇబ్బందులు రావడం వంటి లక్షణాలతో ఈ వ్యాధి ముందుకు సాగుతుంది. ప్రస్తుతానికి ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల, లిథియం లోపం వంటి కొత్త కారణాలను గుర్తించడం మరియు దానికి అనుగుణంగా చికిత్సా మార్గాలను అభివృద్ధి చేయడం వైద్యరంగానికి అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది.


